జనసేన పార్టీ పెట్టిన తరవాత తెలంగాణలో పదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కానీ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. ఆ పార్టీ తరపున ఎనిమిది చోట్ల అభ్యర్థులు నిలబడ్డారు. పవన్ కల్యాణ్ తన చేతుల మీదుగా బీఫాం ఇచ్చారు. ఆ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు సాధించిన ఓట్లు 85వేలు మాత్రమే. అంటే సగటున ఒక్కో నియోజకవర్గంలో పది వేల ఓట్లు కూడా రాలేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే..ఒక్కో నియోజకవర్గంలో సగటున పన్నెండు వందల ఓట్లు వచ్చాయనుకోవచ్చు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎవరితో పొత్తులు లేకపోయినా 32 స్తానాల్లో పోటీ చేయాలనుకుంది. కానీ బీజేపీ పొత్తులు పెట్టుకుని ఎనిమిది సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎనిమిది సీట్లలో జనసేన పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలు మరింత లోకలైజ్ అంశాల ప్రాతిపదికగా జరుగుతాయి. బీజేపీ ప్రదాన పార్టీగా ఉంది కాబట్టి… జనసేనకు మేలు జరిగే అవకాశం ఉంది.
కానీ జనసేన పార్టీకి నిర్మాణం లేదు. ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ లేదు. బీజేపీ ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చే సహకారంపైనా అనుమానాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్ పల్లి మాత్రమే ఇవ్వడం… అసలు బీజేపీకి కూడా క్యాడర్ లీడర్ లేని ఖమ్మం వంటి స్థానాలను కేటాయించడంతో జనసైనికులు నిరాశకు గురవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోలానే నిరాశపరిస్తే ఇబ్బంది అవుతుందని … బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రభావం చూపకపోతే వైసీపీ నేతలు చేసే అసభ్యకామెంట్లు తట్టుకోవడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.