మూడు తరాల వారధి చంద్రమోహన్. హీరోగా కెరీర్ మొదలెట్టి, ఆ తరవాత కమెడియన్గా మారి, ఆ పిదప క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ని మలచుకొని, దశాబ్దాలుగా వెండి తెరతో, చిత్రసీమతో మమేకమై తన ప్రయానణాన్ని కొనసాగించారు. హైటు తక్కువ ఉన్నా, తన మొహంలో తేజస్సు ఉండేది. నటనలో ఉద్దండులకు సైతం పోటీ ఇచ్చేవాడు. `ఇంకొంచెం హైటుంటే నన్నే మించిపోయేవాడు` అంటూ అక్కినేని చేత కితాబు అందుకొన్నాడు. తొలి సినిమా `రంగుల రాట్నం`తోనే నంది అవార్డు దక్కించుకొన్నాడంటే.. చంద్రమోహన్ ప్రతిభను బేరీజు వేసుకోవొచ్చు. హీరోగా చేసిన 175 చిత్రాల్లో.. కనీసం 20, 30 మంచి హిట్టు ఉన్నాయి. `పదహారేళ్ల వయసు` తన కెరీర్లో మరో మచ్చుతునక.
చాలామంది హీరోయిన్లకు చంద్రమోహన్ లక్కీ హీరో. చంద్రమోహన్ పక్కన నటించిన హీరోయిన్లు ఆ తరవాత కాలంలో టాప్ పొజీషన్ కి చేరుకొన్నారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఇందుకు అద్భుతమైన ఉదాహరణలు. `నాతో నటించిన హీరోయిన్లు టాప్ స్టార్లయిపోతే.. నేనిక్కడే ఉండిపోయాను` అని చంద్రమోహన్ కూడా చాలాసార్లు చెప్పేవారు. రాజేంద్ర ప్రసాద్ – చంద్రమోహన్ ల మధ్య చక్కటి కామెడీ కెమిస్ట్రీ కుదిరేది. ఈతరం హీరోలకు బాబాయ్, అన్నయ్య, నాన్న… ఇలా అన్నీ తానై నిలిచాడు.
చంద్రమోహన్ మంచి భోజన ప్రియుడు. కంచంలో అన్ని రకాలైన ఆహార పదార్థాలూ ఉండాల్సిందే. కెరీర్ని చాలా పకడ్బందీగా మలచుకొన్న నటుడు ఆయన. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. మురళీమోహన్, శోభన్ బాబుకు మంచి ఆప్తుడు. వాళ్ల ప్రోద్బలంతోనే స్థిరాస్థుల్లో పెట్టుబడి పెట్టారు. ఆ రూపంలో చంద్రమోహన్ చాలా సంపాదించాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. చేతిలో సినిమాల్లేనప్పుడు ఇల్లు విడిచి బయటకు వచ్చేవారు కాదు. ఇంటి పట్టునే ఉండి, హోమియో మందులు అమ్మేవారాయన. అన్నింటికంటే మరో ముఖ్య విషయం.. తను అజాత శత్రువు. ఇండస్ట్రీలో అందరితోనూ మంచి అనుబంధమే ఉంది. వాళ్లందరీ చంద్రమోహన్ మరణం.. తీరని లోటు.