ఎస్సీ వర్గీకరణ చేస్తున్నట్లుగా ప్రకటన చేస్తారేమో అని మాదిగ విశ్వరూప సభ పెట్టి ఎదురు చూసిన మందకృష్ణ మాదిగకు.. ప్రదాని మోదీ మరిన్ని ఎదురు చూపులు తప్పవని తేల్చేశారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పారు. కానీ ఖచ్చితంగా చేస్తామని చెప్పలేదు. మాదిగలకు న్యాయం చేస్తామని .. ఈ పోరాటంలో మందకృష్ణకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాన్నారు. తన నాయకుడు మందకృష్ణేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లుగా ప్రధాని మోదీ మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పోరాటానికి మద్దతు కోసం .. ప్రతిపక్షాల్ని పిలుస్తారు కానీ ప్రధానిని కాదు. కానీ ప్రధాని వచ్చి పోరాటానికి మద్దతిస్తామని చెప్పి వెళ్లారు.
తాము అయితే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. మరి అంత కట్టుబడి ఉంటే పదేళ్లుగా ఎందుకు వర్గీకరణ చేయలేదన్నది మాత్రం ఆయన చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా కమిటీ ఏర్పాటు ప్రకటన చేశారు. కమిటీ ఏర్పాటు చేయాలి.. ఆ కమిటీ అంతా పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలకు సంబంధించిన విషయం మాత్రం కాదు. జరిగితే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఇలాంటి సున్నితమైన విషయం.. చాలా పార్టీలు చలి కాచుకోవడానికి రెడీగా ఉంటాయి.
తెలంగాణ ఎన్నికల్లో మోదీ పూర్తిగా కుల సమీకరణాల మీద ఆధారపడుతున్నారు. బీసీ సీఎం ప్రకటన చేశారు. మాదిగ వర్గాలకు ..వర్గీకరణ కమిటీ హామీ ఇచ్చారు. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా మున్నూరు కాపుల్ని ఆకట్టుకున్నామనుకుంటున్నారు. మూడు వర్గాల ఓట్లతో .. విజయం సాధించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.
మోదీ వ్యూహం ప్రకారం ప్రసంగాలు చేశారు. బీసీ సభలో పవన్ ను.. మేరా సాథ్ పవన్ హై అ్నారు. మాదిగ విశ్వరూపసభలో మందకృష్ణనే తన నాయకుడన్నారు. అదే సమయంలో ఇద్దరు నేతలతో వేదికపై ఆయన వ్యవహరించిన విధానం డ్రమెటిక్ గా ఉంది. రాజకీాయల్లో ఇలాంటివి మోదీకి మాత్రమే సాధ్యమనిపించేలా మోదీ సభలు జరిగాయి.