కేసీఆర్ నిన్నటి వరకూ బాహుబలి. కానీ ఇప్పుడు ఆయన అత్యంత బేలగా మిగిలిపోయిన ఓ రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఏ బలమూ లేదు. తెలంగాణ ప్రజల సపోర్ట్ లేదు. పార్టీకి క్యాడర్ లేదు. ఉన్న నేతలు ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. ఇలాంటి బలహీనమైన పరిస్థితిని కేసీఆర్ గతంలో ఊహించి ఉండరు. అధికార బలంతో తన కంటే యోధుడు ఎవరూ ఉండరనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.
ఓ వైపు రాష్ట్ర అధికార పార్టీ.. మరో వైపు కేంద్ర అధికార పార్టీ మధ్య నలిగిపోనున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్కు పోటీగా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుంది. గతంలో రెండు సార్లు తమ పార్టీ ఎల్పీలను విలీనంచేసుకున్నందున.. ఈ సారి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ అభివృద్ధి కోసం అధికార పార్టీ అనే కాన్సెప్ట్ ఎంచుకోరని ఏమీ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తలకు మించిన భారమే అవుతుంది. కేంద్రంలో అధికార పార్టీ గురి పెడితే.. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది.
ఎన్డీఏలో చేరినా బీజేపీ పార్టీని మింగకుండా ఉండదు – కేసుల నుంచి మాత్రమే రక్షణ !
ఎంత బలమైన పార్టీ అయినా రెండు జాతీయ పార్టీలతో పోరాడటం అంటే.. కేసీఆర్ కు..బీఆర్ఎస్కు అంత తేలిక కాదు. ఎందుకంటే పదేళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల అనేక రకాల ఆరోపణల లగేజీ మోసుకు తిరగాల్సి వస్తోంది. సీఎంగా ఉండటం వల్ల.. ఢిల్లీలిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాకుండా తప్పించగలిగారని చెప్పుకున్నారు. కeనీ ఇప్పుడు పవర్ పోయింది. ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణల వల్ల మరింత టెన్షన్ ఎదుర్కోవాలి. అందుకే ఇప్పుడు ఏదో ఓ జాతీయ పార్టీతో కేసీఆర్ అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని స్వయంగా మోదీ చెప్పారు. ఆయనను చేర్చుకునేది లేదని.. ఇది తన గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. ముందస్తు అవగాహన ఉన్నందు వల్ల బీజపీతో కలవొచ్చు కానీ ఆ పార్టీ బీఆర్ఎస్ ను బలహీనం చేయకుండా ఉంటుందనుకోవడం భ్రమ. కాకపోతే కేసుల నుంచి .. విచారణల నుంచి కాస్త ఉపశమనం లభించవచ్చు.
కాంగ్రెస్తో కలవలేరు !
నిన్నామొన్నటిదాకా బీఆర్ఎస్ కు రెండు చాయిస్ లు ఉన్నాయి. రెండు పార్టీల్లో దేనితోనైనా కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలోకాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే నేరుగా బీజేపీ నోట్లో చిక్కినట్లే. కేసీఆర్ ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయని అందులో ఒకటి ఒంటరిగా రెండు జాతీయ పార్టీలతో ఫైట్ చేయడం.. రెండోది.. బీజేపీతో కలవడం. రెండు ఆప్షన్లు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటివే. కేసీఆర్కు ఇది అత్యంత గడ్డు పరిస్థితి.