జగన్ రెడ్డి ఆరో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు విశాఖలో రుషికొండను బోడిగుండు చేసి కట్టించుకున్న ఐదు వందలకోట్ల రూపాయల ప్యాలెస్ లో కాపురం చేద్దామనుకున్నారు. అంతా రెడీ చేసుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు కదలడం లేదు. ఏమీ చెప్పడం లేదు. ఏం జరిగిందో వైసీపీ నేతలకూ అర్థం కావడంలేదు. హైకోర్టులో కేసు ఉందని… న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయని కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. కానీ అసలు హైకోర్టును.. సుప్రీంకోర్టును జగన్ రెడ్డి ఎప్పుడు పట్టించుకున్నారు.. అలా పట్టించుకుని ఉంటే రుషికొండ అలా ధ్వంసం అయ్యేది కాదు. మరి ఎందుకు ఆగిపోతున్నారు ?
ఏపీ అధికారవర్గాలు జగన్ రెడ్డి సర్కార్ పై అసంతృప్తితో ఉన్నాయి. అతి కొద్ది మంది జగన్ రెడ్డి సర్వీస్అధికారులు మినహా మిగిలిన వారంతా నిబంధనల ప్రకారమే ఏ పని అయినా చేస్తామని దొడ్డిదారి పనులు చేసేది లేదని తేల్చి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉందని మరోసారి గెలిచే చాన్స్ లేదని అందరికీ అర్థమైపోయిందంటున్నారు. ఓటర్ల జాబితాలు గోల్ మాల్ చేసి… పోలింగ్ రోజున హింస చేసి గెలిచేద్దామని జగన్ రెడ్డి అనుకుంటున్నారని మన ప్రజాస్వామ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని వారికి అర్థమైపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత వారిలో మరింత క్లారిటీ వచ్చిందంటున్నారు.ల
విశాఖకు వెళ్లాలంటే వర్క్ రీ లోకేషన్ ఆర్డర్స్ ఇవ్వాలని లేకపోతే తాము రాలేమని సీనియర్ అధికారులు సీఎస్ కు చెబుతున్నారు. అలా ఆర్డర్స్ ఇస్తే కోర్టు ధిక్కరణ అవుతుంది. అందుకే నోట మాట ద్వారా ఉత్తరాంధ్ర సమీక్షలకు వెళదామని సీఎస్ చెబుతున్నారు. కానీ దీన్ని అధికారులు అంగీకరించడం లేదు. నిజానికి జగన్ రెడ్డి లక్ష్యం వేరు . రాజధానిని మార్చడం కాదు.. మార్చామని ప్రచారం చేసుకోవడం.. ఉత్తారంధ్ర ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యం. ఆ ప్రయత్నాలలోనూ జగన్ రెడ్డి విఫలమవతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం కొంతమంది వంది మాగధులైన అధికారుల్ని పెట్టుకుని నడిపించారు కానీ ఇప్పుడు వారు కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.