రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రి వర్గాన్ని ఎంపిక చేసుకునే విషయంలోనూ ఆయనకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో తమకు కీలకమైన మంత్రి పదవులు అయినా ఇప్పించాలని సీనియర్ నేతలు హైకమాండ్ వద్దకు పరుగులు పెడుతున్నారు. మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ రెండు రోజులుగా హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంప్రదింపులు సీఎం పీఠం కోసం అనుకున్నారు. అయితే నిన్న తొలి దశ చర్చల్లోనే అలాంటి ఆశలు పెట్టుకోవద్దని హైకమాండ్ వారికి తేల్చేసింది.
దీంతో డిప్యూటీ సీఎం, హోం లాంటి కీలక పదవులు అయినా ఇప్పించాలని వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ రెండో రోజూ కూడా కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. అయితే వారి వాదన పట్టించుకున్నారో లేదో స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి తన టీమ్ ను తాను ఏర్పాటు చేసుకునేదుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీనియర్లకు షాకివ్వడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మంత్రి పదవి కూడా దక్కదేమోనన్న ఉద్దేశంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు. తాను ఏ పదవికీ లాబీయింగ్ చేసుకోకుండా రేవంత్ ను పొగుడుున్నారు. భట్టి విక్రమార్కను పమంత్రి వర్గంలోకి తీసుకోకుండా.. పీసీసీ చీప్ ను చేయడమో లేకపోతే స్పీకర్ పదవి ఇవ్వడమో చేస్తారన్న వాదన వినిపిస్తోంది.
అలాంటివి వద్దని తాను మంత్రి వర్గంలోనే ఉంటానని భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. ఆయన కోసం ప్రో బీఆర్ఎస్ మీడియా ఓ రకంగా ఫైట్ చేస్తూండటం ఆయనకు మైనస్ గా మారినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.