extra ordinary man movie review
తెలుగు360 రేటింగ్ : 2/5
నితిన్ నిలకడగా సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ రేట్ లో మాత్రం ఆ నిలకడ వుండటం లేదు. ఒక విజయం వస్తే మళ్ళీ వరుసగా మూడు అపజయాలు ఎదురౌతున్న పరిస్థితి. భీష్మ తర్వాత మళ్ళీ అలాంటి థియేట్రికల్ సక్సెస్ దక్కలేదు. వక్కంతం వంశీకి రైటర్ గా మంచి సక్సెస్ రేట్ వుంది. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి విజయవంతమైన చిత్రాల కథా రచయితగా మంచి పేరు తెచ్చుకునారు. అయితే దర్శకుడిగా చేసిన తొలి చిత్రం నా పేరు సూర్య మాత్రం నిరాశపరిచింది. ఇప్పుడు వీరిద్దరూ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ కోసం కలిశారు. మరి ఈ చిత్రం ఎలాంటి వినోదాల్ని పంచింది? నితిన్ కి మరో విజయం దక్కిందా? దదర్శకుడిగా వక్కంతం వంశీ బోణీ కొట్టరా?
అభి(నితిన్) సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా మంచి మంచి నటుడు కావాలనేది తన ఆశయం. అభి తండ్రి సోము( రావు రమేష్) ఎంత నిరాశపరిచిప్పటికీ పాజిటివ్ వ్యక్తిత్వంతో తన ఆరాధ్య దైవం మైసమ్మ తల్లిని నమ్ముకొని లక్ష్యం దిశగా వెళ్తుంటాడు. ఇంతలో ఒకరోజు సోము కాలు విరుగుతుంది. దీంతో కుటుంబాన్ని నడిపే భారం అభి మీద పడుతుంది. మరోదారి లేక అప్పటికే తనకి పరిచయమైన లిఖిత( శ్రీలీల) కంపెనీలో మంచి జీతానికి ఉద్యోగంలో చేరుతాడు. ఒకరోజు అభి స్నేహితుడు శివ.. అభి పని చేస్తున్న ఆఫీస్ లోకి వచ్చి కథ చెబుతాడు. ఆ కథలో అభినే హీరో అని మాటిస్తాడు. కథ నచ్చడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయడానికి కసరత్తులు కూడా మొదలుపెట్టేస్తాడు అభి. అయితే ఇంతలో దర్శకుడు శివ తన ఆలోచన మార్చుకుంటాడు. అయితే అనుకోకుండా శివవ చెప్పిన కథ.. అందులోని పాత్రలు అభి నిజజీవితంలోకి వస్తాయి. తర్వాత ఏం జరిగింది? శివ చెప్పిన కథలో విలన్స్ ఎవరు? ఇదంతా తన ఆరాధ్యదైవం మైసమ్మ ఆడిస్తున్న ఆట అని నమ్మి ఆ కథలోకి వెళ్లిన అభికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అభి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇదంతా తెరపై చూడాలి.
ఒక స్క్రిప్ట్ లో జరగాల్సిన సీన్ రియల్ లైఫ్ లో జరిగితే ఎలా వుంటుంది? ఇలాంటి ఆలోచనలతో ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చాయి. సూపర్ నాచురల్ థ్రిల్లర్స్, సైకిక్ హారర్ కథలకు ఇలాంటి ఆలోచనలు మంచి ముడిసరుకు. అయితే అదే ఐడియాని కాస్త మార్చి దానితో పక్కా కమర్షియల్ సినిమాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు వక్కంతం వంశీ. ఆలోచన బాగానే వుంది కానీ ఆచరణలో చాలా ప్రయత్న లోపాలు కనిపిస్తాయి. కమర్షియల్ సినిమాలకు కథ రాయడం వంశీకి కొత్తకాదు. కానీ ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తున్న కథ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. ఇంటర్వెల్ బ్రేక్ వరకూ అసలు ఇందులో కథ మొదలుకాదు. ఎంత కమర్షియల్ సినిమా అయిప్పటికీ ప్రేక్షకుడు అందులో వినోదాన్ని ఫీలవ్వాలంటే.. సీన్స్ అన్నిటినీ కలిపే ఒక థ్రెడ్ వుండాలి. అదే ఇందులో మిస్ అయ్యింది.
స్మగ్లర్ గా అభి ఎంట్రీలో కథమొదలౌతుంది. అయితే సీన్ ట్విస్ట్ ని అక్కడే ప్రేక్షకుడు ఊహించేలా వుంటుంది. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా తన కష్టాలు, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కామెడీ కొంతమేరకు వినోదాన్ని పంచుతుంది. అయితే సన్నివేశాలు అలా సాగుతుంటాయి కానీ ఇందులో కథ ఏమిటి ? సంఘర్షణ ఏమిటి ? ప్రేక్షకుడు ఏ విషయానికి ఎక్సయిట్ అవ్వాలి? హై ఇచ్చే మూమెంట్స్ ఏమిటి? ఇలా సందేహాలు తొలుస్తూనే వుంటాయి. ఇంతలోనే సడన్ గా సిఈవో గా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేయడం, హీరో హీరోయిన్ ఇద్దరూ మొదటి సీన్ లోనే దగ్గరైపోవడం, మూడో సీన్ లోనే అతడు హీరోయిన్ కంపెనీకి సిఈవో స్థాయికి ఎదిగిపోయే వ్యవహారం చూసి కమర్షియల్ సినిమాల్లో ఇంతే! అనుకోవాలంతే. అభి, హీరోయిన్ ఇంటికి డిన్నర్ కి వెళ్లిన సీన్ మాత్రం స్పెషల్ గా అదొక ఐటెంలా అనిపించినా థియేటర్ అంతా ఘెళ్ళున నవ్వేలా వుంటుంది. ఇందులో హీరో జూనియర్ ఆర్టిస్ట్. అది అదునుగా చూసి.. విజయ్ దేవర కొండ రష్మిక, నరేష్ పవిత్ర లోకేష్ ఇలా ఇండస్ట్రీలో హాట్ హాట్ వున్న వ్యవహారాలన్నీ అతడితో చెప్పించడం గ్యాలరీని బాగానే నవ్వించింది. దిల్ రాజు తమిళ్ వాయిస్ ని డిజే చేసుకున్న విధానం కూడా అలరించింది.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో కోటియా అనే ప్రాంతంలో జరిగిన ఒక యాదార్ధ సంఘటన ఆధారంగా రాసుకున్న కథని సినిమా కథగా అభికి చెప్పడంతో ఇందులో అసలు పాయింట్ తెరపైకి వస్తుంది. అయితే ఈ కథలోకి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ గానీ కథానాయకుడు రాడు. పైగా ఈ కథలోకి హీరోని తెచ్చిన క్రమం కూడా క్రుతిమంగా వుంటుంది. తెరపై నటించే అవకాశం లేని తనకి నిజ జీవితంలో ఆ పాత్రని పోషించే అవకాశం వచ్చిందని సర్ది చెప్పుకున్నా.. అది అంత సహజంగా కుదరలేదు. పైగా ఇందులో చెప్పాల్సిన కథ అంతా సెకండ్ హాఫ్ లో వుండటంతో లేనిపోని గందరగోళం అనవసరమైన హడావిడి ఎక్కువైపోయింది. స్క్రిప్ట్ లో సీన్ ఆర్డర్ ప్రకారం తన పనులు చేసుకుంటూ వెళ్తాడు హీరో. ఇందులో తొలి నాలుగు సన్నివేశాలు-సినిమాలో ఎడిటింగ్ ఎలా చేస్తారో చూపించడానికి ఒక ట్యుటోరియల్ గా చూపించారు. ఇలాంటి కథలకు అలాంటి ఎత్తుగడలతో కథనం నడపడం అస్సలు కుదరలేదు. పైగా ఇందులో విలన్ పాత్ర పరమ వీక్. విలన్ వలన హీరో సమస్యలు ఎదుర్కొంటాడని ఎవరికీ అనిపించదు. ఇంత వీక్ విలనిజం వున్న పాత్ర వున్నప్పుపుడు కమర్షియల్ సినిమాలకి కావాల్సిన హీరోయిజం బిల్డ్ అవ్వదు. ఇందులోనూ అదే జరిగింది. ఒక దశలో ఈ కథని ఎలా మలుపు తిప్పాలో అర్ధం కాని అయోమయం కథకుడిలోనూ కనిపించింది. రేసుగుర్రం కిల్ బిల్ తరహా కొన్ని సీన్లు వేశారు, పెట్టికి తాళం తీస్తరా అనే ఒక ఐటెం సాంగ్ వేశారు.. ఇలా ఎన్ని జిమ్మిక్కులు చేసినా సన్నివేశాల్లో వినోదం పండలేదు.
నితిన్ కామెడీ టైమింగ్ బావుటుంది. ఇందులో అది బాగానే వర్క్ అవుట్ అయ్యింది. తన పాత్ర వరకూ హుషారుగా చేసుకుంటూ వెళ్ళాడు. అయితే కథలో బలం నవ్యత లేకపోతే .. పాత్రని ఎంత పండించాలని అనుకున్నా ఉపయోగం వుండదు. ఇది నితిన్ గుర్తుపెట్టుకునే పాత్ర ఐతే కాదు. శ్రీలీల జాగ్రత్త పడాలి. చాలా క్రింజ్ సన్నివేశాలన్న పాత్రలు ఆమెకు వస్తున్నాయి. ఆదికేశవ అనుకుంటే.. దానికంటే నీరసంగా వుంది ఈ పాత్ర. పైగా ఆమె డబ్బింగ్ చాలా మైనస్. ఈ పాత్రకైనా, ఎలాంటి సందర్భానికైనా ఒకటే మాడ్యులేషన్. ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తపడాలి. ఇందులో డ్యాన్స్ లు కూడా మెప్పించేలా లేవు. చివరి పాటలో బీటుకూ, స్టెప్పులకూ సంబంధం లేకుండా ఏదో చేసుకొంటూ వెళ్లిపోయారు నితిన్ – శ్రీలీల. రాజశేఖర్ పాత్రలో బలం లేదు. ఆయన ఏరి కోరి ఈ సినిమా ఎందుకు చేశాడో ఆయనకే అర్ధం కావాలి. విలన్ పాత్ర కూడా అంతే .. కామెడీ గా వుంది. రావు రమేష్ తన మార్క్ లో నవ్విస్తారు. కొన్ని చోట్ల మాత్రం ఆయన ఎక్స్ ప్రెషన్స్ టైటిల్ కి తగ్గట్టుగా ‘ఎక్ట్స్ ట్రా’గా అనిపిస్తాయి. మిగతా నటీనటులు పరిదిమేర కనిపించారు.
హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి రాంగ్ ఛాయిస్. ఇంకా మాస్ టచ్ వున్న కంపోజర్స్ తో క్యాచి బీట్స్ కొట్టించుంటే కాస్త ప్లస్ అయ్యేది. ‘డేంజరు పిల్లా’ పాట బాగుంది. నేపధ్య సంగీతం కూడా రొటీన్. కెమరాపని కమర్షియల్ కొలతలకు తగ్గట్టుగా వుంది. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. పైగా ఇందులో కోర్ ఎమోషన్ ని సరిగ్గా పట్టుకోలేకపోయారు. ఆ ఊరి ప్రజలు, హీరోకి మధ్య ఎమోషనల్ ఎటాచ్మెంట్ కుదరలేదు. మొత్తానికి ఆ సెటప్ అంతా చాలా క్రుతిమంగా వుంది. మాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కొన్ని చోట్ల గమ్మత్తైన లైన్లు రాసుకొన్నాడు రచయిత. ‘మహంతి’ పేరుని వాడుకొనే విధానం బాగుంది. కిక్, రేసు గుర్రం లాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ పాత్రలని రాసిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా తన సినిమాని ఎక్స్ట్రా ఆర్డినరీ గా చూపించడంలో పట్టుకోల్పోయారు.
పంచ్ లైన్: ఆర్డనరీనే..!
తెలుగు360 రేటింగ్ : 2/5