తెలుగుదేశం పార్టీలోనే ప్రస్థానం ప్రారంభించకపోయినా టీడీపీ నేతగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న గుర్తింపే ఎక్కువ. రాజకీయ పార్టీలు ఆయనను కార్నర్ చేయడానికి టీడీపీనే ఉపయోగించుకుంటాయి. ఆయన కూడా రాజకీయమో.. గౌరవమో టీడీపీని విమర్శించేందుకు సిద్ధపడరు. తెలంగాణకు టీడీపీ చేసినంత మేలు ఏ పార్టీ చేయలేదని వాదిస్తూ ఉంటారు. ఎందుకిలా అంటే… సబ్జెక్ట్ ఉన్న నేతల్ని టీడీపీ నాయకత్వం ప్రోత్సహించిన విధానంతోనే రేవంత్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సామర్థ్యం , నాయకత్వం తెలంగాణ ప్రజల ముందు సంపూర్ణ స్థాయిలో ఆవిష్కృతమయింది టీడీపీలో ఉన్నప్పుడే.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెరికల్లాంటి యువనేతలు
రేవంత్ రెడ్డి టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డి కి కూడా బంపర్ ఆఫర్లు వెళ్లాయి. కానీ రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు. అంతకు ముందే టీడీపీ యువనేతలు ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడే బాధ్యతల్లో ఉన్నారు. వారికి రేవంత్ తోడయ్యారు. వైఎస్ ప్రభుత్వానికి వీరు ఊపిరి ఆడకుండా చేసేవారు. 2004-2009 వరకూ కేశవ్ , నరేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో దేన్నీ లెక్క చేయ.లేదు. 2009 లో వీళ్ళిద్దరికీ తోడుగా రేవంత్ కలిశారు.
ప్రశ్నిస్తే ప్రభుత్వాలు ఉలిక్కి పడాల్సిందే !
ఇప్పుడు అంటే ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రతిపక్ష నేతలు గొంతెత్తగానే మైకులు కట్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని అధికార పార్టీ సిగ్గుపడేది. ప్రతిపక్ష నేతలు చెప్పేది వినేవారు. రేవంత్ తో పాటు నరేంద్ర, పయ్యావుల అసెంబ్లీతో పాటు బయట కూడా ప్రజా గళాన్ని వినిపించేవారు. అసెంబ్లీలో ముగ్గురిలో ఏ ఒక్కరు లేచి నిలబడినా, బయట ప్రెస్మీట్ పెట్టినా అప్పటి ప్రభుత్వం ఉలిక్కిపడి సమాధానాలు వెదుక్కునేది. ముగ్గురూ సబ్జెక్ట్ పై సుదీర్ఘమైన కసరత్తు చేసే మాట్లాడేవారు. ముగ్గురూ ఇప్పటికీ మంచి మిత్రులు.
ఇతర నేతలకూ ఉజ్వల భవిష్యత్
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఊహించనంత అప్ అండ్ డౌన్స్ తో సాగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రేవంత్ రెడ్డిని పట్టుబట్టి కేసీఆర్ ప్రత్యర్థిగా ఎంచుకున్నట్లుగా టార్గెట్ చేసి రాజకీయాలు చేయడంతో ఆయనప్రస్థానం ఊహించనంతగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన అత్యున్నత పదవిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే నరేంద్ర, పయ్యావుల కూడా కీలకమైన శాఖల్లో మంత్రులుగా ఉంటారని టీడీపీ క్యాడర్ ఆశిస్తోంది.