ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి నీరు వృథాగా పోతోంది. గత ఏడాది ఆగస్టులో ఇదే ప్రాజెక్టులో మూడో నంబర్ గేటు కొట్టుకుపోయింది. మూడో గేటుకు ఇప్పటికీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయకపోగా.. తాజాగా రెండో గేటు కూడా కొట్టుకుపోయింది.
‘రెండో గేటు కింద ఉన్న 2 ఎలిమెంట్స్ కొట్టుకుపోయాయి. ఇంజినీరింగ్ అధికారులు యుద్ధప్రాతిపదికన స్టాప్లాక్స్ పెడుతున్నారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 2 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో మరో 1.5 టీఎంసీల నీరు ఉంటుంది. ఇప్పుడు మొత్తం వృధా అయిపోయింది. కరువు కాలంలో ఆ నీరు ఎంతో ఉపయోగపడతాయనుకున్నారు రైతులు.
గత ఏడాది ఓ గేటు కొట్టుకుపోయినప్పుడు… మొత్తం గేట్లు మార్చాలని నిపుణులు నివేదిక ఇచ్చారు.కానీ జగన్ రెడ్డి సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసింది. గేట్లకు గ్రీజు పూయడానికి కూడా డబ్బులు రిలీజ్ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరో గేటు కొట్టుకుపోయింది. అన్నమయ్యడ్యాం తరహాలో ఈ డ్యాం కూడా నాశనం అయ్యేలా ప్రభుత్వం ఏదైనా టాస్క్ పెట్టుకుందా అన్న అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రయోజనాలు ఏ మాత్రం పట్టకుండా… అత్యంత నిరర్థక ఆస్తిగా ప్రభుత్వం మారిపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.