మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ రెడ్డి తమను నిరాదరణకు గురి చేస్తున్నారని నేరుగానే చెబుతున్నారు. తమకు జగన్ రెడ్డి అంటే ఎంతో అబిమానం అని.. తాను జగన్ కూ మాపై అభిమానం ఉండాలి కదా అని నిష్టూరమాడారు. ఒొంగోలులో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడన్నారు. అయితే కాంగ్రెస్ గెలుస్తుందని తాను 50 లక్షల రూపాయలు పందెం కట్టానన్నారు. కానీ మా అబ్బాయి తెలంగాణ మొత్తం తిరిగి బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడన్నారు. అందుకే కొడుకు ఫీలవుతాడని.. ఆ పందెన్ని వెనక్కి తీసుకున్నానని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోనూ జగన్ గెలుస్తాడని తన కుమారుడు అనుకున్నాడని బాలినేని చెప్పుకొచ్చారు. అయితే అది అభిమానమన్నారు. వారిపై జగన్ కు అభిమానం లేదన్నట్లుగా మాట్లాడారు. తనకు టిక్కెట్ ఇవ్వరని జిల్లాలో వేరే చోట టిక్కెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. తాను ఒంగోలులో తప్ప మరెక్కడా పోటీ చేయబోనన్నారు. పాతిక వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్ రెడ్డికి చెప్పానని బాలినేని చెప్పుకొస్తున్నారు.
బాలినేని ఇటీవలి కాలంలో ఎన్నో సార్లు జగన్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తికి గురయినప్పుడల్లా జగన్ రెడ్డి పిలిచి మాట్లాడారు కానీ.. సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో బాలినేని తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు తమపై జగన్ కు అభిమానం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాను నిజాయితీ పరుడ్నని చెప్పడం లేదని.. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానని కూడా ఒప్పుకుంటున్నరాు. బాలినేని తీరు చూసి.. రాజకీయ నేతలు సైతం విస్మయానికి గురవుతున్నారు. బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.