భారీగా డబ్బుు ఖర్చు పెట్టుకుంటామని వస్తున్న వారి సామర్థ్యాన్ని తూకం వేసి ఇంచార్జుల్ని మార్చేస్తున్న జగన్ రెడ్డి.. ముద్రగడ పద్మనాభం విషయంలో మాత్రం.. ఎదురు ఖర్చులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు. గతంలో పవన్ పై అకారణంగా నిందలేసి.. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా నిలిచి తన దారేమిటో ఆయన చెప్పారు. కానీ అప్పట్లో ఆయన వైసీపీలో చేరే విషయంలో బెట్టు చేశారు.దీనికి కారణం ఎన్నికల్లో పెట్టుకోవాల్సిన ఖర్చేనని చెబుతున్నారు. డబ్బులు కూడా తమనే పెట్టమంటున్నారని క్లారిటీ రావడంతో అప్పట్లో వైసీపీ సైలెంట్ అయింది.
ఇప్పుడు టీడీపీ , జనసేన పొత్తులపై స్పష్టత రావడంతో ఆయన అవసరం చాలా ఉందనుకుంటున్న జగన్.. సరే అని రాయబారం పంపారు. దీంతో ముద్రగడ పార్టీలో చేరిపోయేందుకు రెడీ అయ్యారు. జనవరి ఒకటో తేదీన తన ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి ప్రకటన చేయనున్నారు. వైసీపీ హైకమాండ్ ఆయనకు పెద్దాపురం సీటును ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తోట నరసింహం భార్య పోటీ చేశారు.
ఈ సారి తోట నరసింహానికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమ కర్తగా ముద్రగడ వ్యవహరించారు. కానీ చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లను తీసేసిన వైసీపీ పార్టీలోనే చేరుతున్నారు. కాపుల్ని ఇంత కన్నా ఎవరు మోసం చేస్తారన్న వాదన వినిపిస్తోంది.