బుధవారం విజయనగరం జిల్లా బోగాపురం వద్ద నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ముగింపు సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ నలుమూలల నుంచి విశాఖపట్నం విజయనగరం టీడీపీ నేతలు, శ్రేణులు వచ్చారు. యువగళం ముగింపు సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా టీడీపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షలకు పైగా సభకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు.
రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి విజయనగరానికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. లోకేశ్ జైత్రయాత్ర విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. బహిరంగ సభ నుంచే ఇరు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇరు పార్టీల అధినేతలు కీలక ప్రకటనలు వెల్లడించే అవకాశం ఉంది.
ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా టాప్ టెన్ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 27, 2023న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజక వర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. లోకేశ్ మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు.