లోక్సభలో సెక్యూరిటీ బ్రీచ్ అంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఎంపీలందరిపై గంపగుత్తగా సస్పెన్షన్ వేటు వేస్తూ పోతోంది. పార్లమెంటు భద్రతతో సహా దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లోక్సభలో మంగళవారం 49 మంది ప్రతిపక్షాల సభ్యులపై సస్పెన్షన్ విధించారు. సోమవారం వేటు పడ్డ 78 మంది. అంతకుముందు 14 మందితో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 141 మంది సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు.
భారత పార్లమెంటు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక సెషన్లో సభ్యులు సస్పెన్షన్కు గురికావడం ఇదే తొలిసారి. మంగళవారం సస్పెన్షన్కు గురైనవారిలో ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, జమ్ముకాశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఉన్నారు. పార్లమెంటులో చోటుచేసుకున్న భద్రత వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని, సోమవారం సస్పెండ్ అయిన ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ‘ఇండియా’ కూటమికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు.
భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో పాటు తమ ఎంపిలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన మోదీ… సెక్యూరిటీ బ్రీచ్ చాలా సీరియస్ అన్నారు కానీ.. ఆ అంశంపై పార్లమెంట్ లో మాట్లాడేందుకు మాత్రం సిద్ధంగా లేరు. ప్రకటన చేయాల్సిందేనని విపక్షం… రాజకీయం చేయవద్దని అధికారపక్షం పట్టుదలకు పోతుననాయి. ఫలితంగా ప్రజాస్వామ్య దేవాలయంలో చర్చలు సాగడంలేదు.