తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. నారా లోకేష్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. మీడియాకు ఇంటర్యూలు ఇచ్చిన ఆయన.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేది టీడీపీనేనని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో బీసీలపై జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదని అందుకే బీసీల రక్షణకు చట్టం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
బీసీలకు ఎంపీ సీట్లు ఎక్కువ అంటే ఈ సారి విజయవాడ పార్లమెంట్ సీటు కూడా బీసీలకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పష్టత ఉందేమో కానీ.. ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు. నిఖార్సైన బీసీకి టిక్కెట్ ఇస్తే తానే గెలిపిస్తానని ప్రకటించారు. బహుశా ఆయన ఉద్దేశం బుద్దా వెంకన్న లాంటి వాళ్లకు వద్దని చెప్పడం కావొచ్చు. తెలుగుదేశం పార్టీ.. రిజర్వుడు స్థానాలు కాకుండా.. సగం సిట్లలో బీసీలకు టిక్కెట్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ టిక్కెట్ల కసరత్తు దాదాపుగా పూర్తయిందని చెబుతున్నారు. అయితే.. కోడ్ వచ్చిన తర్వాతనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలఇంచార్జుల నియామకాన్ని కొన్ని చోట్ల మినహా పూర్తి చేశారు. వైసీపీలో టిక్కెట్ రాని నేతల్ని చేర్చుకున్నా వారి పొటెన్షియాలిటీని బట్టి మాత్రమే పరిశీలిస్తారని.. మిగిలిన వారికి అవకాశాలేమీ కల్పించరని అంటున్నారు.