సీజన్ తో నిమిత్తం లేకుండా సందడి చేస్తుంటాయి చిన్న సినిమాలు. ప్రతి వారం ఏదో ఓ చిన్న సినిమా బాక్సాఫీసుని పలకరిస్తుంటుంది. 2023లోనూ చిన్న సినిమాల హవా కనిపించింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలు అందుకున్న చిత్రాలు వున్నాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి పెద్ద సినిమాల హంగామాతో 2023 గ్రాండ్ గా ప్రారంభమైయింది. సంక్రాంతి పెద్ద సినిమాలతో పాటు వచ్చిన సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం పెద్ద ప్రభావాన్ని చూపలేదు. తర్వాత సుదీర్ బాబు హంట్ కూడా పరాజయం పాలైయింది. ఫిబ్రవరిలో వచ్చిన రైటర్ పద్మభూషణ్ తో చిన్న సినిమాల మెరుపు మొదలైయింది. సుహాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే చాయ్ బిస్కట్ వినూత్న ప్రచార కూడా సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం షణ్ముఖ ప్రశాంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచమయ్యాడు. అదే నిర్మాణ సంస్థ చేసిన మరో చిత్రం మేమ్ ఫేమస్ కూడా ప్రేక్షకుల దృష్టిలో పడింది.
తర్వాత వచ్చిన బుట్టబొమ్మ, వినరో భాగ్యం, శ్రీదేవి శోభన్ బాబు మిస్టర్ కింగ్ లాంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయితే మార్చిలో విడుదలైన ‘బలగం’ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద బలంగా నిలబడింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం విశేషమైన ఆదరణ పొందింది. తెలంగాణ నేపధ్యంలో చక్కటి భావోద్వేగాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం పదింతల లాభాలు చూసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ఏప్రిల్, మే లో పెద్దగా ఆకట్టుకున్న చిన్న సినిమాలు కనిపించలేదు. మేలో వైజయంతి మూవీ నుంచి వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి కానీ స్లో నేరేషన్ తో ఆ సినిమా థియేటర్ ఆడియన్స్ ని అనుకున్నంత అలరించలేకపోయింది. జూన్ చివర్లో చిన్న సినిమాకి మళ్ళీ కొత్త కళ తీసుకొచ్చింది శ్రీ విష్ణు సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచింది. ఆహ్లాదకరమైన వినోదం పంచి బాక్సాఫీసు వద్ద కూడా మంచి లాభాలు చూసింది. చాలా రోజుల తర్వాత నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ కి మళ్ళీ హిట్ కళ తీసుకొచ్చింది సామజవరగమన.
జులైలో మరో చిన్న సినిమా బేబీ పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ‘ఓ రెండు మేఘాలు’ పాట విజయవంతమైయింది. అది ప్రమోషన్స్ కి బాగా ప్లస్ అయ్యింది. ఇక సినిమా విడుదలైన ఇందులో కంటెంట్, ఆనంద్, వైష్ణవి, విరాజ్ ల ముక్కోణ ప్రేమకథ యూత్ కి తెగ నచ్చింది. నిర్మాతలు కూడా మంచి లాభాలు చూశారు. దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ. 80 కోట్లు వసూలు చేసిందని ట్రేట్ వర్గాలు లెక్క కట్టాయి. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా బేబీనే. ఈ సినిమాని కల్ట్ విజయమని ప్రకటించిన నిర్మాతలు అదే పేరుతో ఓ కొత్త టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసేశారు.
యువ ప్రేక్షకులే లక్ష్యంగా అక్టోబర్ లో వచ్చిన ‘మ్యాడ్ ‘సినిమా లక్ష్యాన్ని చేరుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా మరిచయమైన ఈ చిత్రం ఈ ఏడాది కాలేజీ కుర్రాళ్ళ ఫేవరేట్ సినిమాగా నిలిచింది. సరదాగా సాగిపోయే సన్నివేశాలు, లైటర్ వెయిన్ ఫన్ తో నడిపిన కథనం యువతరాన్ని అలరించింది. చిన్న సినిమాగా వచ్చి మంచి లాభాలు చూసిన సినిమాల జాబితాలో చేరింది. మండేలాకి రిమేక్ గా వచ్చిన సంపూర్నేశ్ బాబు మార్టిక్ లూథర్ కి కూడా మంచి ప్రసంశలు దక్కాయి.
నవంబర్ లోనూ చిన్న సినిమాల హవానే నడిచింది. తరుణ్ భాస్కర్ నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన ‘కీడా కోలా’ క్రైమ్ కామెడీ ని ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించి అలరించారు తరుణ్ భాస్కర్. మాఊరి పొలిమేరకు సీక్వెల్ కి వచ్చిన పొలిమేర 2 అనూహ్య విజయం సాధించింది. నిజానికి పొలిమేర 1ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీ ఇచ్చిన నమ్మకంతో పార్ట్ 2 ని నేరుగా థియేటర్స్ లో విడుదల చేస్తే ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అజయ్ భూపతి తీసిన మంగళవారం విడుదలకు ముందు చాలా బజ్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ టేబుల్ ఫ్రాఫిట్ తో సినిమా విడుదల కావడంతో నిర్మాతలు లాభాలు చూశారు. శ్రీకాంత్ చాలా కాలంతో ప్రధాన పాత్రలో చేసిన కోటబొమ్మాలి పీఎస్ కు కూడా మంచి ఆదరణ లభించింది. డిసెంబర్ లో కొన్ని చిన్న సినిమాలు వచ్చాయి కానీ ఉనికి చాటలేకపోయాయి. యాంకర్ సుమ కుమారుడు బబుల్ గమ్ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. ఈ ఏడాది చివర్లో వచ్చే చిన్న సినిమా అదే. ఆ సినిమా ఫలితం తేలాల్సివుంది. మొత్తానికి 2023 బలగం, సామజవరగమన, బేబీ, మ్యాడ్.. ఇలా చిన్న సినిమాలతో పెద్ద విజయాలు చూసింది.