ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఊహించని ప్లాన్ లో నే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంచార్జ్‌గా కీలక నేత మాణిక్యం ఠాగూర్ ను నియమించారు. మాణిక్యం ఠాగూర్.. కొంత కాలం తెలంగాణ వ్యవహారాల ఇంచార్జుగా పని చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలతో.. మనస్తాపానికి గురయి… వైదొలిగారు. ఇప్పుడు ఆయనను ఏపీకి నియమించారు. గతంలో ఏపీకి కేరళకు చెందిన ఉమెన్ చాందీ ఇంచార్జిగా ఉండేవారు. ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో అప్పట్నుంచి ఇంచార్జ్ లేరు. ఇప్పుడు ఠాగూర్ కు చాన్సిచ్చారు.
మాణిక్యం ఠాగూర్ యువకుడు.. చురుగ్గా వ్యవహరించే నేత.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ బతికించాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనకు కనిపించిన మార్గం షర్మిల, షర్మిల ను పార్టీలోకి తీసుకుని ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఆ దిశగా ఆమె సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టత లేదు. మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో షర్మిల సిద్దపడితే వెంటనే ఏపీలో రంగంలో దించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే పరిస్థితుల్ని చక్కదిద్దడానికి మాణిక్యం ఠాగూర్ ని నియమించినట్లుగా భావిస్తున్నారు.
షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే… మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా వైసీపీ పరిస్థితి అవుతుంది. అందుకే జగన్ రెడ్డి. కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. ఆమెను చేర్చుకోకుండా మంతనాలు జరుపుతున్నారని కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందన్నది మరో నెల రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.