ఆర్థికంగా రాష్ట్రం దివాలా స్థితిలో ఉందని శ్వేతపత్రం ద్వారా ప్రకటించిన కాంగ్రెస్.. ఏదైతే అది అయిందని.. గ్యారంటీ పథకాలను అమల్లోకి తెస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నందున ఈ లోపే అమల్లోకి తేవాలని డిసైడయ్యారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది. అందులో మరో గ్యారంటీ అయిన ‘మహాలక్ష్మి పథకం’పై కలెక్టర్లతో రేవంత్ సమావేశం అవుతున్నారు.
మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈనెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. మహిళలకు రూ. 2,500 ఇస్తామనే హామీ అమలుపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. లబ్దిదారుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై కలెక్టర్లకు సీఎం స్పష్టత ఇవ్వనున్నారు.
రెండు పథకాలకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించినట్టు తెలిసింది. గ్యాస్‌సిలిండర్ సబ్సిడీ కోసం ఇప్పటికే వినియోగదారులు గ్యాస్ ఎజెన్సీల వద్ద కేవైసీ కోసం బారులు తీరారు. దీంతో పాటు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్న వాగ్దానంపై సర్కారు దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఆరు పథకాలను అమలు చేసి.. ఎక్కువ లోక్ సభ సీట్లు పొందాలన్న ఆలోచనలో ఉన్నారు.