జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడైనా పోటీ చేయమంటే పోటీ తాను సిద్ధంగా ఉన్నానని కమెడియన్ ఫృధ్వీ చెప్పుకొచ్చారు. ఆయన తనకు తను జనసేనలో ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారు కానీ..అధికారికంగా జనసేనలో చేర్చుకోలేదు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం ఆయన వేసిన వేషాలను జనసైనికులు మర్చిపోలేకపోతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇండస్ట్రీలో అందరిపై ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు. చివరికి ఎవరిని చూసి అలా చేశారో.. వాళ్లే వెళ్లగొట్టడంతో ఇప్పుడు జనసేన పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ నుంచి గెంటేసిన తర్వాత నుంచి ఆయన జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో శ్రీకృష్ణదేవరాయుల విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన.. వైసీపీ సర్కార్ ఇంటికి పోవడానికి రెడీ అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. విజయనగరంలో జరిగింది విజయోత్సవ సభలా ఉందన్నారు. మంత్రి రోజా, అహంకారం ఎక్కువ అని వారి నో ర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు. అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ పనికొస్తారని సెటైర్ వేశారు.
“నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలతో నిరూపితం అవుతుంది. అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దు” అని జనసేన నేతలకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వెల్లువలా టీడీపీ, జనసేన పార్టీల్లో నేతలు చేరుతారన్నారు.