మూడు రోజుల కిందటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు జరుపుతున్నారు. సాక్షి ఖాతాలో వంద కోట్లు చేరేలా ప్రకటనలు ఇప్పించుకున్నారు. స్కూల్ పిల్లలతో పాటలు పాడించుకున్నారు. బయట సమ్మెలో ఉన్న అంగన్వాడీలు శాపనార్థాలు పెట్టారు….అది వేరే సంగతి. అయితే స్వయంగా ఆయన చెల్లి షర్మిల సోషల్ మీడియా వేదికగా కూడా హ్యాపీ బర్త్ డే చెప్పలేదు. ఆయన తల్లి వైపు నుంచి కూడా స్పందన లేదు. దాదాపుగా కుటుంబసభ్యులెవరూ పట్టించుకోలేదు. వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్ మనకెందుకులే అని జనం కూడా పట్టించుకోలేదు.
కానీ షర్మిల ఇప్పుడు ఓ ట్విస్ట్ ఇచ్చారు. నారా లోకేష్‌కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. వైఎస్ ఫ్యామిలీ తరపున ఆ గిఫ్ట్ ను పంపినట్లుగా సందేశం ఇచ్చారు. తనకు పంపిన గిఫ్ట్ పై లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా షర్మిలకు ధ్యాంక్స్ చెప్పారు. లోకేష్ ఇలా చెప్పడం వల్లనే బయటకు తెలిసింది. గతంలో ఎప్పుడూ.. లోకేష్ కు కానీ.. చంద్రబాబు కుటుంబానికి కానీ.. ఇలా గిఫ్టులు… శుభాకాంక్షలు వైఎస్ కుటుంబం నుంచి రాలేదు. ముఖ్యంగా జగన్ రెడ్డి చేతుల్లోకి రాజకీయం వచ్చాక…. చంద్రబాబు కుటుంబం అంటే… తమకు ఫ్యాక్షన్ శత్రువులు అన్నట్లుగా చూడటం ప్రారంభించారు. ఇప్పుడు జగన్ రెడ్డి అంత కంటే ఘోరంగా అయ్యారు కానీ ఆయన కుటుంబసభ్యులు మాత్రం మారుతున్నట్లుగా కనిపిస్తోంది.
షర్మిల గతంలో ఇలాంటి గిఫ్టులు పంపలేదు. ఈ ఏడాదే పంపారు. షర్మిల గతంలో లోకేష్ ను జగన్ రెడ్డి బాటలోనే కించ పరిచారు. రకరకాల మాటలన్నారు ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె మారిపోయారు. లోకేష్‌తో ఆమెకు కానీ.. ఆమె రాజకీయ పార్టీకి కానీ ఎలాంటి రాజకీయ అవసరాలు ఉండవు.. కానీ రాజకీయాల్లో సుహృద్భావం ఉండాలన్న తన విధానం మేరకు షర్మిల ఈ గిఫ్టు పంపినట్లుగా అనుకోవచ్చని చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలకు ఆస్తులు పంచివ్వడం లేదని. ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల వారు ఎదురుపడిన సందర్భాలు కూడా లేవు. అందుకే ఇలాంటి ఘటనలన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.