పాలనలో రాజకీయం చొప్పించేసి రచ్చ చేయడం కన్నా అధికారులను తమ విధి నిర్వహణలో స్వేచ్చగా ఉంచడానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు. అది పోలీసు వ్యవస్థ అయినా రాజకీయవ్యవస్థ అయినా అదే చేస్తున్నారు. ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన ఇచ్చిన భరోసా ఇదే.
అభివద్ది చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో, అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపెడితే, దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది చివరి వరుసలో వున్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి సూటిగా తేల్చేశారు. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే పని చేయకపోయినా… నిర్లక్ష్యం చేసినా ఫ్రెండ్లీగా ఉంటామని రేవంత్ స్పష్టం చేశారు. ప్రజలచేత శభాష్ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా వుంటుందని నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశ్యపూర్వకంగా నిర్ణయాలు తీసుకున్నా పరిస్థితి తేడా ఉంటుందన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ పౌరులతో ఉండాలే కానీ, క్రిమినల్స్‌తో కాదని పోలీసులకు రేవంత్ స్పష్టం చేశారు. పోలీసు శాఖలో వేర్వేరు విభాగాలను దేనికోసమైతే ఏర్పాటు చేశారో, వాటి లక్ష్యాలు నెరవేరాలని దిశానిర్దేశం చేశారు. నేరాల విధానం మారింది. సైబర్ క్రైం పెరిగింది. దానిపై దృష్టి పెట్టాలన్నారు. సన్ బర్న్ పార్టీలపై ఉక్కుపాదం మోపాలని.,, ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులకు సంపూర్ణ అధికారాలు ఇస్తున్నామన్నారు.
అదే సమయంలో సున్నితంగా రేవంత్ అధికారులకు ఆఫర్ ఇచ్చారు. పని చేయడానికి అధికారులకు ఇబ్బంది అనిపిస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పోలీసు డిపార్ట్మెంట్లో అయితే డీజీపీకి తెలియపర్చండి. ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే మరోచోటికి మిమ్మల్ని బదిలీచేయడానికి, బాధ్యతలనుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రేవంత్ సూటిగా ఉండటంతో తమ సత్తా చూపాలనుకున్న అధికారులకు .. ధైర్యం వచ్చినట్లయింది.