జగన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు మేం పని చేస్తున్నాం అని ఐ ప్యాక్ అధికారిక ప్రకటన చేసింది. ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా అమరావతికి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఓ సంచలనంగా మారింది. దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో ఎప్పుడూ అసోసియేట్ కాలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి పని చేసేందుకు పీకే ఆసక్తి చూపినా.. .చంద్రబాబు అంగీకరించలేదని చెబుతారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పీకే విషయంలో చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
ప్రశాంత్ కిషోర్, తెలుగుదేశం పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా బయటకు తెలియని సమావేశాలు కొన్ని ప్రశాంత్ కిషోర్ , టీడీపీ బృందం మధ్య జరిగాయని చెబుతున్నారు. ఈ భేటీల్లో కొన్ని సార్లు లోకేష్ కూడా పాల్గొన్నారని చెబుతున్నారు. కొంత కాలంగా అంతర్గతంగా పీకే టీములు ఏపీలో పరిస్థితుల్ని అంచనా వేసి.. నివేదికలు సమర్పించాయని వాటి పైనే ఇప్పుడు చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారని అంటున్నారు. అయితే వైసీపీ కోసం పనిచేస్తూ.. టీడీపీ కోసం ఎందుకు పీకే ఆరాటపడుతున్నారన్నది ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం.
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐ ప్యాక్ అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఆ సంస్థ మంచి సక్సెస్ అయింది. అది ప్రశాంత్ కిషోర్ ఒక్కడితే కాదు. కానీ ఆ సంస్థ మాస్టర్ మైండ్ మాత్రమే పీకేనే. క్లయింట్లకు వరుసగా విజయాలు అందించిన తర్వాత ఆయన సొంత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఐ ప్యాక్ అదికారిక వెబ్ సైట్ ప్రకారం చూస్తే.. ప్రశాంత్ కిషోర్ రిఫరెన్స్ ఎక్కడా ఉండదుత రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి చేతుల్లో సంస్థ నడుస్తోంది. ఇప్పుడు ఈయన ఆఫీసు తాడేపల్లిలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటారు.
ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన కాసేపటికి ఐ ప్యాక్ గురించి విస్తృత ప్రచారం జరుగుతూండటంతో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తాము వైసీపీకే పని చేస్తున్నామని .. స్పష్టం చేసింది. అయితే ఈ ట్వీట్ లో పీకే తమ సంస్థకు సంబంధం లేదని చెప్పలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. మరి ఇలాంటి కంపెనీని జగన్ రెడ్డి ఎలా నమ్ముకోగలరు అన్నదే ఇప్పుడు అసలు చర్చ. అందుకే త్వరలో ఐ ప్యాక్ ను కూడా వదిలించుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.