గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన నలుగురు లోక్ సభ సభ్యులు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనిపై ఢిల్లీలో రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత వారు హైకమాండ్ తో సంప్రదింపులు ప్రారంభించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకే ఎక్కువగా అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గాలి కూడా అలాగే ఉండటంతో ఎంపీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఆర్థిక బలాన్ని చూసి కాంగ్రెస్ చాన్స్ ఇస్తుందని నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. అలాగే రెండు రిజర్వుడు నియోజకవర్గాల ఎంపీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు కాంగ్రెస్ గెలవక ముందే ఆ పార్టీతో టచ్ లోకి వెళ్లారు. రేవంత్ తో భేటీ అయ్యారు.
రాజ్యసభ సభ్యులుగా స్వల్పకాలం అవకాశం పొందిన గాయత్రి రవి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ లోనే ఉండేవారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. తన పదవి కాలం పూర్తయ్యాక కనీసం ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరపున పోటీ చేసినా ఆశ్చర్యం ఉండదన్నట్లుగా పరిణామాలు మారుతున్నాయి.