ఎవరి సినిమాపై వాళ్లకు గురి. `తప్పకుండా హిట్టు కొడతాం` అనే కాన్ఫిడెన్స్ లేకపోతే.. సినిమా తీయడమే వేస్ట్! చిన్న సినిమా, పెద్ద సినిమా.. ఏం తీసినా దర్శకుడికి తన సినిమాపై తనకు నమ్మకం ఉండాల్సిందే. ప్రశాంత్ వర్మకీ తన సినిమాపై గట్టి కాన్ఫిడెన్స్. అందుకే `గుంటూరు కారం`తోనే పోటీకి దిగాడు. జనవరి 12న గుంటూరు కారం విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. అదే రోజున `హనుమాన్` కూడా వస్తోంది. ఓ పక్క మహేష్ సినిమా ఉంటే, మరో సినిమాని విడుదల చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్.. ప్రశాంత్ వర్మలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఎవరేం అన్నా, ఎన్ని రకాలుగా భయపెడుతున్నా, బ్లాక్ మెయిల్ చేస్తున్నా.. తన సినిమాని రంగంలోకి దింపుతున్నాడు. అయితే.. సగటు సినీ అభిమానిగా తాను మాత్రం ముందు మహేష్ సినిమానే చూస్తానంటున్నాడు.
”ఆ రోజున నా సినిమా వస్తున్నా సరే.. ఫస్ట్ ఛాయిస్ మహేష్ సినిమానే. ఎందుకంటే మహేష్ ఎప్పుడూ కనిపించని మాస్ అవతార్ లో దర్శనమిస్తున్నారు. పైగా త్రివిక్రమ్ గారి సినిమా. విజువల్ ట్రీట్ గా ఉండబోతోంది. ఆ సినిమానే చూస్తా. ఎందుకంటే ‘హనుమాన్’ చాలా సార్లు చూసేశా. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మళ్లీ నా సినిమా నేను చూడను. చూస్తే.. కరక్షన్లు గుర్తొస్తాయి. ఇంకో పది రోజులు టైమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మహేష్ సినిమాతో మేం పోటీ అని చెప్పడం లేదు. ఆ రోజు మహేష్ సినిమా చూశాక… హాయిగా.. ‘హనుమాన్’ చూస్తారన్న నమ్మకం మాకుంది. వెజ్, నాజ్ వెజ్ రెండూ ఒకే విందులో ఉంటే తప్పేం లేదు. సినిమాలేం కాలేజీలో కోర్సులు కాదు. ఎంపీసీ, బైపీసీ ఏదో ఒకటి తీసుకోవడానికి. ఎన్ని సినిమాలొస్తే అన్నీ చూడొచ్చు. ఈ సంక్రాంతికి 5 సినిమాలొస్తున్నాయి. ఐదూ.. బాగా ఆడాలని కోరుకొంటున్నా” అన్నారు.