కష్టపడి నడక నేర్చుకుని నడుస్తూంటే తమ కాళ్లకు తాము అడ్డం పెట్టుకుని కింద పడిపోతారు కాంగ్రెస్ నేతలు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ కలిసి ఓ ఫోటో పెట్టుకుని కలిసి నిర్మిద్దాం నవశకాన్ని అంటూ ఓ గ్రాఫిక్స్ పోస్టర్ వేసుకున్నారు. దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ హ్యాండిల్ లోనే వేసుకున్నారు. దీన్ని చూసి కాంగ్రెస్ నేతలు వీరిద్దరూ కలిసి ఏదో సొంత ప్రభుత్వంపైనే కుట్ర చేస్తున్నారని ఫీలవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇలాంటి ప్రచారాలను ప్రారంభించారు.
భట్టి విక్రమార్క సీఎం పదవి కోసం ప్రయత్నించారు. ఆయనకు నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదు. కోమటిరెడ్డి ప్రయత్నించలేదు. కానీ ఆయన దగ్గర ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. రేవంత్ రెడ్డిని దించేయడానికి తమ దగ్గర ఉన్న వారు చాలని వీరనుకుంటున్నారేమో కానీ.. వీరి పదవులు కూడ ఊడిపోతాయన్న సంగతిని గుర్తించలేకపోతున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్ సభ సీట్లు సాధిస్తే రేవంత్ రెడ్డి మరింత పట్టు పెంచుకుంటారు. వీరు ఇలాంటి పోస్టర్లు వేసుకుంటే… లోక్ సభ ఎన్నికల తర్వాత వీరి పరిస్థితి ఘోరంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొంత కాలంగా రేవంత్ ప్రభుత్వం ఆరు నెలలు మాత్రమే ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. భట్టి, కోమటిరెడ్డి పోస్టర్ సందేశాలను రేవంత్ రెడ్డి అంత తేలికగా తీసుకోలేరు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తాను చేయాల్సింది చేసుకుంటారు కానీ.. కాంగ్రెస్ నేతల తీరు మాత్రం.. ప్రజల్లో మరోసారి చర్చనీయాంశమవుతోంది.