పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కంపెనీ ఐ ప్యాక్ పని అయిపోయిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఆ సంస్థ సేవల కోసం ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి మాత్రమే ఆ సంస్థ పని చేస్తోంది. మరో పార్టీ సేవలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఐ ప్యాక్ ఏదో బ్రహ్మపదార్థం అనుకుని ఒప్పందం చేసుకున్న కేసీఆర్ కూడా వెంటనే వదిలించుకున్నారు. ఐ ప్యాక్ పరిస్థితి ఇలా కావడానికి కారణం ప్రశాంత్ కిషోర్ లేకపోవడమే.
ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్న అగ్రశ్రేణి పొలిటికల్ స్ట్రాటజీస్టుల్లో ఒకరు. ఆయితే ఆయన తన ఇన్నింగ్స్ ను ముగించారు. సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. బీహార్ లో కొంత కాలం పాదయాత్ర చేశారు. తర్వాత కంటిన్యూ చేయనున్నారు. చివరి సారిగా ఆయన డీఎంకేకు పని చేశారు. ఆ తర్వతా మరే పార్టీకి పని చేసేది లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు ఆయన ఇండివిడ్యువల్ గా ఇతర పార్టీలకు పని చేస్తున్నారు. తాజాగా టీడీపీతోనూ చర్చలు జరుపుతున్నారు.
సీఎం జగన్ కు ఐ ప్యాక్ పై మంచి గురి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ విజయం కోసం ఐ ప్యాక్ పని చేసినప్పుడు ఆ సంస్థను ప్రశాంత్ కిషోర్ నడుపుతున్నారు. ఆయన ఆలోచనల మేరకే ఐ ప్యాక్ నడిచేది. కానీ ఇప్పుడు రోజు వారీ ఐ ప్యాక్ వ్యవహారాల్లో పీకే పాలు పంచుకోవడం లేదు. దీంతో వ్యూహాలు పెద్దగా ఫలించడం లేదన్న బాధ వైసీపీలో కనిపిస్తోంది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఐ ప్యాక్ టీం.. వైసీపీకి ఘన విజయాలు అందుతాయని రిపోర్టులు ఇచ్చిందని చెబుతారు. కానీ మొత్తం రివర్స్ అయింది.
గతంలో చాలా రాజకీయ పార్టీలు ఐ ప్యాక్ సర్వీస్ కోసం ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు ఒక్క వైసీపీ తప్ప మరే పార్టీ సేవలు తీసుకోడం లేదు. దీనికి కారణం పీకే లేకపోవడమే. సంస్థలోని మిగతా వారిపై బయట వ్యక్తులకు పెద్దగా నమ్మకం లేదు. ఏపీలో వైసీపీ ఫలితంగానే ఐ ప్యాక్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కానీ వైసీపీ అప్పటి వరకూ ఐ ప్యాక్ సేవల్ని కొనసాగిస్తుందా అన్న సందేహం ప్రారంభమైంది.