కడప లోక్ సభ నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయమయిపోయిందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తేల్చేశారు.. తనకు ఉన్న సమాచారం మేరకు అని ఆయన కవర్ చేసుకుంటున్నప్పటికీ కొంత కాలంగా షర్మిలకు రాజకీయ సలహాదారు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్కే చెప్పారంటే… షర్మిలలో ఆ ఆలోచనలు ఉన్నాయని అనుకోక తప్పదని రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే ఆర్కే ఇక్కడ ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు అదేమిటంటే.. జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కడప లోక్ సభ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. కానీ షర్మిల పోటీ చేస్తారని తెలిస్తే మాత్రం ఆమె ఆగిపోతారని అంటున్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డిపై సొంత కుటుంబంలోనే వ్యతిరేకత ఉంది.. ఆయనకు పై షర్మిల పోటీ చేస్తే ఫలితం తేడాగా ఉంటుందని అనుమానిస్తున్నారు.
షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారని గతంలో ఆర్కే చెప్పారు. అయితే తర్వాత మళ్లీ జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లి ఆ ప్రయత్నాలను నిలుపుదల చేశారని.. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు హ్యాండిచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ మళ్లీ ఇప్పుడు షర్మిల మనసు మార్చుకున్నారని ఏపీలో రాజకీయాలు చేయడానికి ఫిక్సయ్యారని అంటున్నారు. షర్మిల వైపు నుంచి కూడా ఇలాంటి సంకేతాలు వచ్చాయి. ఇటీవల క్రిస్మస్ కు పులివెందులకు వెళ్లలేదు. హైదరాబాద్ లో బ్రదర్ అనిల్ చర్చిలో క్రిస్మస్ జరుపుకున్నారు. వారే తన కుటుంబం అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కుటుంబంతో పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఆమె తల్లి కూడా లేదు.
కారణం ఏదైనా చివరి తాను వదిలిన బాణం అయిన చెల్లి కూడా తన మీదకే రావడానికి .. స్వయంగా జగన్ రెడ్డి అహంకారం తప్ప మరేమీ కారణం కాదని ఆర్కే తేల్చేశారు. నాడు జగన్ రెడ్డి గెలవాలని కిందా మీదా పడిన ప్రతి ఒక్కరూ ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకమయ్యారు. పైగా ఇప్పుడు డబ్బు పేరాశతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. జగన్ రెడ్డి డబ్బు పిచ్చి ఆయనను పాతాళంలోకి నెట్టేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ తాను ఎందుకు ఒంటరి అయ్యానని ఆయన ఆలోచించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఎందుకు టీడీపీకి దగ్గరయ్యారో కూడా ఆర్కే వివరించారు. జగన్ రెడ్డి రాయల్టీ ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టారట. ఐ ప్యాక్ ఏర్పాటు చేసినందుకు పని చేసినందుకు ఒప్పందం ప్రకారం కొంత రాయల్టీ ఇవ్వాల్సి ఉండగా.. అలాంటివేమీ జగన్ రెడ్డి ఇవ్వకపోవడంతో చంద్రబాబుకు దగ్గరయ్యారని ఆర్కే చెబుతున్నారు. .