వైఎస్ఆర్సీపీలో అభ్యర్థుల కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ 31లోపు 50 మంది ఇంచార్జుల మార్పుతో రెండో జాబితా వస్తుందని వారంతా.. ఒకటో తేదీ నుంచి పెన్షన్ కానుక పంపిణీతో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభిస్తారని నాలుగు రోజులుగా చెబుతున్నారు. కానీ ఆ జాబితా మాత్రం విడుదల కాలేదు సరి కదా.. మెల్లగా పాత అభ్యర్థులకే టిక్కెట్లు ఖరారు చేస్తున్నట్లుగా సమాచారం ఇస్తున్నారు.
షర్మిల ఎంట్రీతో భయపడుతున్న జగన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలు కానున్నారు. లాంఛనంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ బాధ్యతలను తీసుకోవడమే మిగిలింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి కడప నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తానని సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో క్రిస్మస్ పండుగకు టీడీపీ ముఖ్య నేతలకు ఎప్పుడూ లేని విధంగా గిఫ్ట్లు పంపారు. టిక్కెట్ రాదని తెలిసి వైసీపీకి గుడ్ బై చెప్పేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. టిక్కెట్లు నిరాకరించే చాలా మంది అదే పని చేయబోతున్నారు. టిక్కెట్లు రాని వారికి టీడీపీ, జనసేనల్లో చాన్స్ దొరకదు. కానీ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీలో చోటు దొరుకుంది.
బెదిరింపులకు దిగుతున్న నేతలు
ధిక్కారం ఇప్పుడు వైసీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ రెడ్డి కి నమ్మిన బంటు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తిరుగుబాటు దీనికి నిదర్శనం. ఉత్తరాంధ్ర నుంచి అవకాశం రాని నేతలంతా అదే బాటలో ఉండనున్నారు. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సీఎం జగన్ తనను నమ్మలేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రాజకీయ పార్టీల్లో ఒక్క సారి అంటుకుంటే.. అది దావాలనం అవుతుంది.ఎదురుగా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే.. ఇక కట్టు తెగిపోతుందన్న అంచనాలు వస్తాయి.
మళ్లీ సీనియర్ నేతలకే టిక్కెట్లు ఖరారు చేస్తున్నట్లుగా సంకేతాలు
తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది కదా అని.. ఇక్కడ టిక్కెట్లు మార్చాలనుకోవడంతో.. కాలికి అంటింది ముక్కుకు రాసుకున్నట్లు అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు అబ్బే టిక్కెట్లు మార్చట్లేదు మీరే అభ్యర్థులు అని సమాచారం పంపారు. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ను మార్చేస్తామని ముందుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. అలాగే బాలినేని శ్రీనివాస రెడ్డి , రోజా , అంబటి రాంబాబు సహా కీలక నేతలందరి పేర్లు మార్పు జాబితాలోకి వచ్చినా మళ్లీ తప్పించారు అభ్యర్థుల మార్పు ప్రచారం చేసినంతగా ఉండబోదని.. ఓ పది, ఇరవై సీట్లతోనే సరిపెడతారని ఇప్పుడు వైసీపీలో చెప్పుకుంటున్నారు. .