డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే మాజీ మంత్రి జగన్ ను ఒక్క సారి కలిసేందుకు అవకాశం ఇప్పించాలని తాడేపల్లి ప్యాలెస్ లో పెత్తనం చేసి రెడ్డి నేతల్ని బహిరంగసభా వేదికగా బతిమాలుకున్నారు. బయటే ఇలా బతిమాలుకున్నారంటే… జగన్ ను కలవడానికి ఆయన ఎంత కాలంగా పడిగాపులు పడుతున్నారో చెప్పాల్సిన పని లేదు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ జగన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. ఎందుకు అంటే… రాజధానిని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారని కారణం చెప్పారు. జగన్ రెడ్డి రాజధానిని నాశనం చేస్తే టీడీపీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే సమాధానం లేదు. తర్వాత రాజధానిని నాశనం చేసిన జగన్ రెడ్డి వద్దకే చేరిపోయి.. టీడీపీని నానా మాటలన్నారు. ఆయనను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చి… ప్రత్తిపాడు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన టీడీపీని నానా మాటలన్నారు చంద్రబాబును దూషించారు. సజల్ల ఆఫీస్ నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే దాన్ని చదివేశారు.
చివరికి ఆయనకు మ్యాటర్ లేదని ఎన్నికల్లో గెలవలేడని తేలిన తర్వాత పూర్తిగా కరివేపాకును చేశారు. తాడికొండ నుంచి ఆయన రెండు సార్లు గెలిచారు. కానీ ఆయనను ఇంచార్జిగా చేసి.. మళ్ల తీసేసి.. .మళ్లీ పెట్టి.. మళ్లీ తీసేసి.. ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు ఆయనకు వైసీపీలో నిలువ నీడ లేదు. పట్టించుకునేవారు లేరు. అధికార పార్టీ అని ఆశపడితే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. రాజకీయాల్లో విశ్వసనీయత పోగొట్టుకోకూడదనడానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి నేతలు ఎదురుగా కనిపిస్తూంటారు.