అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఓనర్ల కన్నా సీఎం జగన్ రెడ్డి చేసి మోసమే అతి పెద్దది. డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం వేగంగా స్పందించింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులుగా ఉన్న 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించింది. వాటిని వేలం వేసి… బాధితులకు డబ్బులు చెల్లించాలనుకునే ప్రక్రియపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు వేయించి అడ్డుకున్నారు. అప్పటికీ కోర్టు అనుమతితో టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు తగ్గించి, 22 వారాల తరువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బడ్జెట్లో రూ. 1150 కోట్లు ఇస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలనూ పెట్టారు. కానీ రూపాయి కూడా విడుదల చేయలేదు. తర్వాత బడ్దెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు . కానీ ఖర్చు చేయలేదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేవు. మంజూరు లేదు. అగ్రిగోల్డ్ సంస్థ 2015 జనవరిలో బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు, ఏజెంట్లు గుండెపోటుతో ఇప్పటి వరకు 300 మందిపైనే మృతి చెందారు. వారిలో 144 మందికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. తాము వస్తే రూ. పది లక్షలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇలా చావులతోనూ ప్రయోజనం పొందారు.
అగ్రిగోల్డ్‌లో రాష్ట్రానికి చెందిన 19.52 లక్షల మంది డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టగా, దేశంలోని ఏడు రాష్ట్రాలలో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బాధితులకు న్యాయం చేస్తామని గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అయినప్పటికీ బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. బాధితులకు రూ.3,964 కోట్లను చెల్లించాలని సిఐడి తేల్చింది. ఆస్తుల్ని అమ్మేసి న్యాయం చేద్దామని చూస్తే… అడ్డగోలు ఆరోపణలు చేసి.. కోర్టులకు వెళ్లి ఆపేశారు. ఇప్పుడు తాము వచ్చాక నిండా ముంచేశారు. ఇప్పుడు ఈడీ వేలం వేసిన కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇక ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదని తేలిపోయింది.జగన్ రెడ్డిని నమ్మి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని నిందించారు. దూరం చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం గోచీ ఊడదీశాడు జగన్ రెడ్డి.
ఈ విషయంపై నారా లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోమని తక్షణం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.