కౌన్ బనేగా కరోడ్ పతీ! వినోదం, విజ్ఞానం అందించిన మేటి రియాలిటీ షో. కౌన్ బనేగాతో అమితాబ్ బచ్చన్ జీవితం మొత్తం మారిపోయింది. తన కెరీర్లోనే అధ్వాన స్థితిలో ఉన్న అమితాబ్ ని కాపాడింది ఈ రియాలిటీ షోనే. ఎంతో మంది సామాన్యులు ఈ షోలో పాల్గొని విజేతలుగా నిలిచారు. పాపులారిటీ సంపాదించుకొన్నారు. ఈ షోని మిగిలిన ప్రాంతీయ భాషల్లోనూ రూపొందించారు. తెలుగులో చిరంజీవి, నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఎంతమంది స్టార్లు ఈ షో చేసినా అమితాబ్ కళ ఎవరికీ రాలేదు. ఏ షో కూడా ఇంత పాపులర్ కాలేదు. అలాంటి కౌన్ బనేగా కరోడ్ పతి… ప్రయాణం ముగిసింది. 15 సీజన్ల పాటుగా అలరించిన ఈ షోకి ముగింపు వాక్యం పలికారు. ఆఖరి ఎపిసోడ్ ని అమితాబ్ పూర్తి చేశారు. ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ షో మొదలెట్టినప్పుడే, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తనకు తెలుసని, అయితే ప్రతీ ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుందని, అది ఈ రోజే వచ్చిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు బిగ్ బీ. ఈ షోని కంటిన్యూ చేసే అవకాశాలు అంతంత మాత్రమే. బిగ్ బీ అరోగ్యం ఈమధ్య అంతగా సహకరించడం లేదు. మరోవైపు రియాలిటీ షోల మధ్య ఆధిపత్యం మొదలైంది. ఈ నేపథ్యంలో కౌన్ బనేగాని ఇక ముందు చూడలేకపోవొచ్చు. ఏది ఏమైనా దశాబ్దాలుగా అలరించిన ఈ షో.. టీవీ చరిత్రలోనే తనకంటూ ఓ అధ్యాయం సృష్టించుకోగలిగింది.