తెలంగాణలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి చేశామని అయినా ప్రజలు ఓడగొట్టారని .. వాళ్లకు మంచి చేయకుండా యూట్యూబ్ చానళ్లు పెట్టుకున్నా గెలిచేసేవారమని కేటీఆర్ నిట్టూర్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తీరు చూస్తూంటే… ఆయన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని సులువుగానే అర్థమవుతుంది. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చంద్రబాబు అనే నాయకుడు అసలు ఓడిపోయే అవకాశమే ఉండేది కాదు.
అభివృద్ధే ఓటింగ్ కు ప్రాతిపదిక అయితే చంద్రబాబు ఓడిపోతారా ?
అభివృద్ధి ప్రాతిపదికగా ఎన్నికలు జరగాలని చంద్రబాబు తాపత్రయపడ్డారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సృష్టించిన సంపదన… ఆంధ్రప్రదేశ్ కు తెచ్చిన గుర్తింపు.. సైబరాబాద్ అభివృద్ధి … మాత్రమే కాదు.. జిల్లాల వారీగా మెరుగుపడిన మౌలిక సదుపాయాల గురించి చెప్పాల్సిన పని లేదు. అదో స్వర్ణయుగం. కానీ ఆయనను 2004లో ఓడించారు. అదే చంద్రబాబు మూడో సారి గెలిచి ఉంటే… హైదరాబాద్, ఏపీ ఎలా ఉండేదో కదా అని అప్పటి యువత…. అనుకోకుండా ఉండరు. కానీ ఆయన ఎప్పుడూ .. తాను అభివృద్ధి చేయకుండా.. ఇంకేదో చేసి ఉంటే గెలిచి ఉండేవాడినేమో అనుకోలేదు.
పదేళ్లు ఉమ్మడి ఏపీ… ఐదేళ్లు అవశేష ఏపీలో చంద్రబాబు కృషిని కాదని ఓడించలేదా ?
పదేళ్లు అధికారానికి దూరమైన తర్వాత రాష్ట్ర విభజన జరిగితే.. ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉన్నా.. ప్రజలు అత్యంత ఘోరంగా ఓడగదొట్టారు. ఫలితాలు చూసి ఆయన కళ్లల్లో నీటి చారికలు కనిపించాయి కానీ.. ప్రజల్ని నిందించలేదు. సొంత రాష్ట్రంపై..రాజధానిపై ఇతర నేతలు కుట్రల్ని చేధించలేకపోయారు. అయినా ఆయన తాను అభివృధ్ధి చేయకుండా కుల రాజకీయాల్ని చేసిఉంటే గెలిచి ఉండేవాడినని ఆయన అనుకోలేదు. మరోసారి కష్టపడి ప్రజల మనసుల్ని గెలుచుకనే ప్రయత్నం చేస్తున్నారు.
కేటీఆర్ నిష్ఠూరాలు అలాగే ఉంటే.. ఇక ఎప్పటికీ కోలుకోలేకపోవచ్చు
ప్రజాస్వామ్య రాజకీయాలు అంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు.. ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్ లను వద్దనుకోవడానికి .. అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ కు మేలైన మార్కులు వేస్తారు. అయినా అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. దానికి కారణం ఖచ్చితంగా యూట్యూబ్ చానళ్లు పెట్టులేకపోవడం కాదు. ఎందుకంటే.. కాంగ్రెస్ కు పది శాతం మీడియా.. ఆన్ లైన్ మీడియా సపోర్ట్ ఉంటే.. మిగతా 90 శాతం బీఆర్ఎస్కే ఉంది. లోపాలు ఎనాలసిస్ చేసుకుంటే… మళ్లీ తిరిగి పోరాడవచ్చు.. లేకపోతే.. ఇలా నిరాశపడుతూనే ఉండిపోతారు. ఇది చరిత్ర చెప్పే నిజం.