తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు మొదటి సవాల్ గా పార్లమెంటు ఎన్నికలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికే బలమైన అభ్యర్థులపై ఓ అంచనాకు వచ్చారు. వారిలో ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ వారితో చర్చలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ ఈ పేర్లను సమర్పించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను ఇన్చార్జీలుగా నియమించింది. ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలపై ఏఐసీసీ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందో, అక్కడక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై పార్టీ తీవ్ర కరసత్తు చేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామనీ, కార్పొరేషన్ చైర్మెన్ పదవులిస్తామనీ, ఎమ్మెల్సీ పదవులిస్తామంటూ పార్టీ హామీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటువంటి నాయకులను ఎట్లా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా పార్టీ సీరియస్గా చర్చించనుంది.