గుంటూరు కారం తరవాత మహేష్ బాబు సినిమా రాజమౌళితోనే అనే విషయం తెలిసిందే. గుంటూరు కారం పూర్తయిపోయింది. ఈ సంక్రాంతికే విడుదల. పండగ తరవాత… రాజమౌళి సినిమా ఏర్పాట్లు మొదలైపోతున్నాయి. జనవరిలో తన టెక్నీషియన్ల టీమ్ మొత్తం తనకు అందుబాటులో ఉండాలని రాజమౌళి హుకుం జారీ చేశాడు. వాళ్లతో ప్రీ ప్లానింగ్ వర్క్స్ మొదలు పెట్టనున్నాడు. మహేష్ కోసం ఓ వర్క్‌షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి నిరవధికంగా షూటింగ్ సాగబోతోంది. సినిమా మొత్తాన్ని మూడు దేశాల్లో పూర్తి చేయాలన్నది రాజమౌళి ప్లాన్. అందుకోసం లొకేషన్ రెక్కీ కూడా పూర్తయిపోయింది. అమేజాన్ అడవుల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సివుంది. దట్టమైన అటవీ ప్రాంతాల కోసం రాజమౌళి టీమ్ రిక్కీ చేసింది కూడా. తాను సినిమా మొదలెట్టే ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి, కథా నేపథ్యం గురించీ, హీరో పాత్ర గురించి హింట్ ఇవ్వడం రాజమౌళి స్టైల్. ఏప్రిల్ లోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ వెంటనే షూటింగ్ మొదలెడతారు. దాదాపు 1500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. నిర్మాణ భాగస్వామిగా ఓ హాలీవుడ్ సంస్థ కూడా చేరబోతోందని సమాచారం అందుతోంది. ఆ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.