ఏపీ ప్రభుత్వంలో ఒకటి నుంచి వంద వరకూ జగన్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్లు ఉంటారు. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే ఇప్పుడు తన ప్రభుత్వానికి గడ్డు కాలం ఉందని.. ఎమ్మెల్యేలని బలి చేస్తున్నారు. అదీకూడా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై వారిలో అసహనం పెరిగిపోతోంది. తొలి సారిగా ఓ ఎమ్మెల్యే జగన్ పై పూర్తి స్థాయిలో ఫైల్ అయ్యారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాను జగన్ చెప్పిన పనులన్నీ చేశానని ఆయన అన్నారు.
జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసి లను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన ఫైర్ అయ్యారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని అన్నారు. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారు.
జగన్ రెడ్డి తీరు పార్టీలోనూ వివాదాస్పదమవుతోంది. టిక్కెట్లు ఇచ్చినా సరే.. చాలా మంది .. గెలిచినా ఏం చేయగలమన్న నిర్వేదంలోకి వెళ్తున్నారు. దళిత ఎమ్మెల్యే అడిగిన వాటికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సి ఉంది.