తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. వంద రోజుల పాటు ప్రణాళికాబద్దంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతల ప్రచార కార్యక్రమాలు జరగనుంది. “రా… కదలిరా’ పిలుపుతో 5 నుంచి జనంలోకి చంద్రబాబు వెళ్లనున్నారు. 5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. టీడీపీ-జనసేన సంయక్తంగా నిర్వహించే ఈ సభలకు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. బుధవారం 3వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్సన్ సెంటర్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సమావేశం నిర్వహించబోతున్నారు.
4వ తేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ ప్రారంభం అవుతుంది. బీసీల్ని ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంత దారుణంగా వంచించారో, ఎంతగా వారిపై దమనకాండ సాగిస్తున్నారో ప్రతి బీసీ కుటుంబానికి తెలియచేసి బలహీనవర్గాల్లో చైతన్యమే లక్ష్యంగా టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తోంది. టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం ఆధ్వర్యంలోకార్మికుల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయనున్నారు.
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన యాత్రను కూడా బుధవారం నుంచి ప్రారంభిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు మనస్థాపానికి గురై చనిపోయిన వారికి భువనేశ్వరి సాయం చేయనున్నారు. అలాగే తెలుగుదేశంలో చేరడానికి చాలామంది అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ చేరికలకు సంబంధించి రెండు కమిటీలు నియమించారు.