విశాఖ జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు .. టీడీపీని వీడిన తర్వాత ఫేడవుట్ అయిపోయారు. వైసీపీలో చేరి ఆయన తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా వైసీపీలో గుర్తింపు లభించే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేశారు. బుధవారం చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆయన 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయనను కలిసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. పవైసీపీ ఓడిపోవడంతో ఆయన కొద్ది కాలానికి వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీలో చేరలేదు. తెలుగుదేశం పార్టీలో చేరదామనుకున్నా ఆయనకు స్థానిక రాజకీయాలు దారి ఇవ్వలేదు. దాంతో సైలెంట్ గా ఉండిపోయారు. మధ్యలో పవన్ కల్యాణ్ కూడా దాడి వీరభద్రరావుతో ఒకటి రెండు సార్లు సమావేశం అయ్యారు కానీ.. జనసేనలో చేరలేదు. తర్వాత మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు కనీ ఆయన కుటుంబానికి కానీ అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏదో ఓ నమినేటెడ్ పోస్టు అయినా ఇస్తారేమో అనుకున్నారు. కానీ దాడి కుటుంబాన్ని సీఎం జగన్ అసలు గుర్తించలేదు. ఏ పోస్టూ ఇవ్వలేదు.
పార్టీలో ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. దీంతో దాడి కుటుంబం చాలా కాలంగా రాజకీయంగా కార్యకలాపాలేమీ లేకుండానే ఉంది. కీలకమైన గవర సామాజికవర్గంలో పట్టు ఉన్న నేతగా దాడి వీరభద్రరావుకుపేరు ఉంది.కానీ చేసిన తప్పటడుగుల వల్ల.. ఆయనతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను అంధకారం చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీలో చేరినా ఆయనకు టిక్కెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేదు.