తెలుగు సాహిత్య చరిత్రలో మకుటం లేని మహారాజుగా నిలిచిన రచన… కన్యాశుల్కం. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. గిరీశం, మధురవాణి అనే గొప్ప క్యారెక్టర్లని పుట్టించిన కథ ఇది. ఈ నాటకాన్ని సినిమాగా తీశారు. ఆ క్యారెక్టరైజేషన్లను చాలామంది చాలా సినిమాల్లో వాడుకొన్నారు. ఇప్పుడు ఈ కన్యాశుల్కం వెబ్ సిరీస్ రూపంలో వస్తోంది. క్రిష్ ఈ వెబ్ సిరీస్‌కి కర్త, కర్మ, క్రియ. ఆయన సారధ్యంలో ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ నిర్మించారు.
‘చూసీ చూడంగానే’ సినిమాతో దర్శకురాలిగా ఆకట్టుకొన్న శేష సింధూరావు ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. జీ 5 లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. మధురవాణిగా అంజలి, గిరీశంగా అవసరాల శ్రీనివాస్ నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ‘హరి హర వీరమల్లు’ అర్థాంతరంగా ఆగిపోవడంతో క్రిష్ కి ఈ వెబ్ సిరీస్ పై దృష్టి నిలిపే సమయం దక్కింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. క్రిష్ సారథ్యం వహించడం, కన్యాశుల్కం లాంటి గొప్ప నవలని తీసుకోవడం, అంజలి, అవసరాల లాంటి నటీనటుల్ని ఎంచుకోవడంతో ఈ వెబ్ సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.