శాసనసభ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంటు ఎలక్షన్లలో పోటీ చేయాలా..? వద్దా..? అనే మీమాంస బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఉంది. డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓట్లు రాకపోతే ఆయా జిల్లాల్లో లోక్ సభ ఓట్లు వస్తాయని ఆశలు పెట్టుకోవడం లేదు. అందుకే ఆయా జిల్లాల్లోని సిట్టింగులు పోటీకి వెనుకడుగు వేస్తున్నారు.
అయితే గ్రేటర్ పరిధిలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పార్లమెంటు సీట్లలో పోటీచేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేశారు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల అభ్యర్థుల ఎంపికపై కేటీఆర్ .. సమీక్షల్లో ఫైనల్ చేసే అవకాశం ఉంది. పార్లమెంటు నియోజకవర్గాలవారీ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ స్పష్టత ఇచ్చే ్వకాశం ఉంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి ఈ సమీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు… ఈనెల 12 వరకూ కొనసాగుతాయి. సంక్రాంతి సందర్భంగా 13 నుంచి 15 వరకు విరామమిచ్చి… 16 నుంచి కొనసాగిస్తారు. 21తో ఈ సన్నాహక సమావేశాలు పూర్తవుతాయి.
హరీష్ రావు కన్నా ఎక్కువగా కేటీఆరే బాధ్యత తీసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల టాస్క్ కూడా ఆయనదేనన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు హరీష్ రావు తరచూ మీడియా ముందుకు వస్తున్నా.. ఆయన చొరవ తక్కువగానే ఉంది. కేసీఆర్ ఇంకా కోలుకోలేదు. కోలుకున్నా ఆయన రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందన్నది అంతుబట్టని విధంగా ఉంది. అందుకే కేటీఆర్ కే లోక్సభ ఎన్నికల ఫలితాల క్రెడిట్ దక్కనుంది. అది ఓటమే ఎక్కువగా ఉంటుందన్న ప్రచారంతో కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారుతోంది.