వెంకటేష్ సైంధవ్ ట్రైలర్ బయటికి వచ్చింది. ఈ చిత్రం తండ్రీకూతురు ఎమోషన్ నేపధ్యంతో వుండే యాక్షన్ డ్రామా. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కట్ చేశారు. ”నాన్న సూపర్ హీరో.. మా నాన్న వుంటే నాకేమీ కాదు’ అని బేబీ సారా వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమైయింది. వెంటనే ఈ కథలో అసలైన కాంఫ్లిక్ట్ ని చూపించారు. వెంకటేష్ కూతురుకి అనారోగ్యం చేస్తుంది. తను బ్రతకాలంటే ఒక ఇంజక్షన్ కావాలి. అది మామలు ఇంజక్షన్ కాదు.. దాని ఖరీదు 17 కోట్లు. అంత డబ్బు ఒక మధ్యతరగతి తండ్రి ఎలా సమకూరుస్తాడు.? అప్పుడే వెంకటేష్ లోని మరో కోణం సైకో (ఇందులో వెంకటేష్ పాత్ర పేరు) బయటికి వస్తుంది. తర్వాత విలన్ గ్యాంగ్ తెరపైకి వస్తుంది. ఇంతకు ముందు సైకో ఏం చేసేవాడు ? అతని గతం ఏమిటి ? ఇవన్నీ ఆసక్తికరం.
ట్రైలర్ వెంకటేష్ ఇంటెన్స్ యాక్షన్ బావుంది. ‘నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదరా.’ షర్టు వేసుకున్న ప్రతి ఒక్కడికే కాలర్ వుంటుంది. కానీ ఆ కాలర్ ఎవడి మెడమీద వుందో తెలుసుకొని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్ది’ అనే డైలాగ్స్ బాగా పేలాయి. నవాజుద్దిన్, ఆర్యపాత్రలు కూడా బలంగా కనిపించాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని లావిష్ గా డిజైన్ చేశారు. శైలేష్ కొలను టేకింగ్ కి తగ్గట్టు సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతం స్టయిలీష్ గా కుదిరింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా రిచ్ గా వుంది. పండక్కి ఫ్యామిలీ సెంటిమెంట్ వున్న సినిమాలపై ఆసక్తి వుంటుంది. సైంధవ్ యాక్షన్ సినిమాలా కనిపిస్తున్న ఇందులో కోర్ ఎమోషన్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా వుందని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.