ఏపీ రాజధాని అమరావతి కేసు ఈ రోజు సుప్రీంలో ఏప్రిల్‌కు వాయిదా పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినపిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. గత ఏడాది జూలైలో డిసెంబర్‌కు వాయిదా వేసింది.
అయితే డిసెంబర్ లో విచారణకు రాలేదు. జనవరిలో విచారణకు వచ్చింది కానీ ఏప్రిల్ కు వాయిదా పడటంతో అప్పటికి ఏపీలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిపోతుంది. రాజధాని అంశానికి ఓ ముగింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది.
వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు. అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ కేసు విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇక జగన్ రెడ్డికి మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేసే అవకాశం పోయింది. సమీక్షల పేరుతో కార్యాలయాలను కూడా తరలించడం సాధ్యం కాదని తేలిపోయింది. తప్పుడు పనులకు రాజ్యాంగం అనుమతించదని తేలిపోయింది.