‘పలాస’ చిత్రంతో ఆకట్టుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఈ సినిమా నటుడిగా తనకి మంచి పేరు తీసుకొచ్చింది. పలాస తర్వాత మరో మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూసిన ఆయన ‘శశివదనే’ అనే ప్రేమకథ చేస్తున్నాడు. గోదావరి నేపధ్యంలో సాగే ఈ ప్రేమకథ టీజర్ ని వదిలారు. ఒక అందమైన కోట లాంటి ఇల్లు. అందులో రాణి లాంటి అమ్మాయి. అమ్మాయిని చూసి ప్రేమలోపడ్డ అబ్బాయి.. ఈ తరహాలో టీజర్ మొదలైయింది. ఆకట్టుకునే బీజీఎం, స్లో మోషన్ లోని మాంటేజ్ షాట్స్ తో టీజర్ ని ముందుకు నడిపారు.
టీజర్ ముఖ్య ఉద్దేశం.. ప్రేక్షకులని టీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచడం. అలాంటి ఆసక్తి ఈ టీజర్ లో భలే కుదిరింది. అప్పటివరకూ అమ్మాయి ప్రేమలో పరవశించిపోయిన కథానాయకుడు.. ఒక్కసారిగా పాడుబడ్డ ఇంటిని చూడటం.. ఆ ఇంటితో పాటు తన రూపంలో కూడా గుర్తుపట్టలేనంత మార్పు చోటు చేసుకువడంతో.. ఈ ప్రేమకథలో అసలు కోణం ఏమిటనే ఉత్సుక పెంచాడు దర్శకుడు సాయి మోహన్. ప్రేమకథలో ప్రధాన జంట రక్షిత్, కోమలీ నటన ఆకట్టుకుంది. గోదావరి నేపధ్యం మంచి ఫీల్ యాడ్ చేసింది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచగలిగింది.