గవర్నర్ కోటాలో గతంలో మంత్రి వర్గం సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ న్యాయపోరాటం ప్రారంభించింది. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. బీఆర్ఎప్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలోనే మంత్రిమండలి తీర్మానం చేసింది. దానిని గవర్నర్ కు పంపింది.
అయితే, క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. ఈ అంశంలో గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, క్యాబినెట్ కు ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. నిజానికి గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం అయితేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.
ఎమ్మెల్సీలను తిరస్కరించడం అనేది గవర్నర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు. సిఫారసు చేసేది మంత్రి వర్గమే అయినా గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో న్యాయపోరాటం ఫలించే అవకాశాలు తక్కువ. అయితే ఆ రెండు స్థానాలను భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ ఇంకాఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.