తనను అన్యాయంగా జైల్లో పెట్టారని చంద్రబాబు ప్రజల ముందు ఆవేదన వ్యక్తం చేస్తే.. చంద్రబాబు కేసుల గురించి మాట్లాడుతున్నారని బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టులో వాదించారు…. ప్రభుత్వ న్యాయవాది. అటు ప్రభుత్వం.. ఇటు చంద్రబాబు కేసుల గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ జగన్ రెడ్డి మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులు తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాకినాడ సభలో ఆయన సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనకు పాల్పడి కేసుల గురించి మాట్లాడారు.
జగన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడటమే కాదు.. కోర్టుల ప్రోసీడింగ్స్ ను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అవినీతిని కోర్టులు నిర్దారించాయని చెప్పుకొచ్చారు. కనీస ఆధారాలు కూడా లేవని హైకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంలో స్పష్టం చేసింది. మరి ఎక్కడ నిర్దారించిందో జగన్ రెడ్డి చెప్పాల్సింది అసలు ఇంకా సుప్రీంకోర్టు లో ఉన్నా.. కేసుల గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దన్న.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జగన్ రెడ్డి మాట్లాడారు. కోర్టులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోబోమన్న తమ విధానాన్ని బహిరంగంగానే వ్యక్త పరిచారు.
తన ప్రత్యర్థులపై కోర్టు రూల్స్ పక్కాగా ఉండాలని.. తాను మాత్రం… కోర్టులను పట్టించుకోనని జగన్ రెడ్డి తన చేతల ద్వారా చూపిస్తున్నారు. రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టి ఎన్నికలను గెలవాలనుకునే జగన్ రెడ్డి వంటి వారికి.. ప్రజాస్వామ్యం వీలు కల్పించదు. ఇలాంటి వారిని న్యాయస్థానాలు కూడా చూస్తూ ఊరుకోవని.. ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.