తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి టీ న్యూస్ చానల్ టీఆర్ఎస్ ఆఫీస్ నుంచే నడుస్తుంది. టీఆర్ఎస్ ఆఫీస్.. రాజకీయ కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ ను నడుపుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఉంది. అక్కడ వ్యాపారం చేయడం నిషిద్ధం. కానీ అడిగే వారు లేరు.. పాలకులు కూడా వారే కాబట్టి నడిచిపోయింది. పదకొండేళ్లుగా టీఆర్ఎస్ ఆఫీసు నుంచే టీ చానల్ రన్ అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అధికారులకు రూల్స్ గుర్తుకు వచ్చాయి. వెంటనే నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ భవన్కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా 2011 నుంచి టీ న్యూస్ ఛానల్ను యాజమాన్యం బీఆర్ఎస్ భవన్లోనే నిర్వహిస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని నోటీసుల్లో పేర్కొన్నారు.
నిజానికి టీ న్యూస్ చానల్ ను మార్చాలని చాలా కాలం క్రితమే అనుకున్నారు. నంది నగర్ లో కేసీఆర్ ఇంటి కి దగ్గరతో… బీసీ వేల్ఫేర్ హాస్టల్ పక్కన ఖాళీ స్థలంలో సెటిల్మెంట్ చేసి కొంత మొత్తం .. కేసీఆర్ బంధువులు రాయించుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అందులో టీ చానల్ పెట్టాలనుకున్నారని చెబుతారు. కానీ ఎందుకో అది ఆగిపోయింది. ఇంకా ఎక్కడైనా ప్రణాళికలు రెడీ చేసుకున్నారో లేదో కానీ.. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేసినందుకు తెలంగాణ భవన్ ను … సర్కార్ స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.