ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ‘హనుమాన్’కు ఏపీ, తెలంగాణల్లో థియేటర్లు దొరకడం లేదు. అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమాకి మంచి బజ్ ఉంది. అక్కడ వీలైనన్ని ఎక్కువ థియేటర్లు ‘హను-మాన్’ సొంతం చేసుకొంది. నార్త్‌లో దాదాపు 1200 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. తెలుగు నాట తక్కువ థియేటర్లు దొరికినా, ‘హను-మాన్’ రిస్క్ తీసుకొంటుందంటే దానికి ఇదే కారణం. అయితే తేజా సజ్జా మాత్రం నార్త్ లో ఎంత ఆడినా, తెలుగులో ఆడితేనే మజా అంటున్నాడు.
”ఓ తెలుగు సినిమా నార్త్ లో ఆడితే గొప్పే. కానీ నాకు పాన్ ఇండియా స్టార్ కావాలని లేదు. నేను తెలుగు బిడ్డని. మీ మధ్య పెరిగాను. తెలుగు సినిమా తీశాను. నాకు తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి స్పందన వస్తోందన్నదే ముఖ్యం. ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. కానీ మా సినిమాని విడుదల చేయక తప్పడం లేదు. ఇప్పటికే చాలాసార్లు సినిమాని వాయిదా వేశాం. మరోసారి వాయిదా వేయడం ఇష్టం లేదు. పైగా నార్త్ లో ఆల్రెడీ థియేటర్లు బుక్ అయిపోయాయి. సినిమా డిస్టిబ్యూటర్ల చేతిలో ఉంది. అందుకే… మరో మరో మార్గం లేకుండా పోయింది” అంటున్నాడు తేజా. కానీ ఈ సినిమాపై తేజా చాలా నమ్మకంగా ఉన్నాడు. ”మేమంతా చాలా కష్టపడ్డాం. ఇక ఫలితం ఆ హనుమంతుడి చేతుల్లోనే ఉంది” అంటూ దేవుడిపై భారం వేసేశాడు తేజా!