ఏపీలో తమను అడిగి మరీ పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ నేతలు టీడీపీని డిమాండ్ చేస్తున్నారు. విచిత్రంగా ఉన్న ఈ డిమాండ్ ను బీజేపీ కోర్ కమిటీ సమావేశం తర్వాత సత్యకుమార్ మీడియా ముందు పెట్టారు. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని ఎప్పటి డైలాగే చెప్పారు. మరి జనసేన టీడీపీతో వెళ్తోంది కదా అంటే.. టీడీపీకి తమతో పొత్తు కావాలంటే.. హైకమాండ్ ను సంప్రదించాలని లేకపోతే.. పవన్ కల్యాణ్ అయినా టీడీపీతో ఆ మాట చెప్పించాలని సూచించారు. అంటే ఇప్పటి వరకూ పొత్తుల ప్రతిపాదనలు టీడీపీ వైపు నుంచి కానీ.. బీజేపీ వైపు నుంచి కానీ రాలేదు. బీజేపీ రెడీగా ఉంది కానీ.. టీడీపీ తిరస్కరిస్తుందేమోనని అందుకే.. ఆ పార్టీనే అడగాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మాతో పొత్తులు పెట్టుకోవాలని కోరుకుంటున్న పార్టీలు మా అధిష్టానంతో మాట్లాడాలన్నారు. బీజేపీ పొత్తు కోరుకుంటున్నామని టీడీపీ నేతలతో పవన్ కూడా చెప్పించాల్సి ఉండాల్సిందని.. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు కోరుకుంటున్నామని పవన్ టీడీపీతో చెప్పించి ఉండాల్సిందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు అంతకు ముందు ఇతర పార్టీలతో పొత్తులపై నేతల నుంచి జాతీస సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలు తీసుకున్నారు. పొత్తులపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది.
పొత్తుల్లేకుండా పోటీ చేయగలమా అనే అంశం పైనా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలిసింది. పొత్తుల్లేకుండా పోటీ చేస్తే.. ఓట్లు పెరుగుతాయోమో కానీ.. సీట్లు రావని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. జనసేనతో పొత్తు కొనసాగుతోందనే అంశాన్ని నేతలు స్పష్టంగా చెప్పాలన్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశం పైనా చర్చించారు. ఏపీలో అమిత్ షా పర్యటనలోగానే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు శివ ప్రకాష్ జీని కోరారు. నేతల దగ్గర లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తెలుసుకున్న శివప్రకాష్.. హైకమాండ్ కు నివేదించనున్నారు.