విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఈ సారి టిక్కెట్ ఇవ్వడం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతల ద్వారా ఆయనకు సమాచారం పంపారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం తగ్గించుకోవాలని .. సభలకు కార్యక్రమాలకు ఇంచార్జ్‌గా ఎలాంటి బాధ్యతలు ఇవ్వనందున… హడావుడి చేయవద్దని సూచించారు. ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా సోషల్ మీడియాలో తెలియచేశారు. చంద్రబాబు సూచన మేరకు పార్టీకి చెందిన కొంత మంది ముఖ్య నేతలు ఆయనను కలిసి పరిస్థితిని వివరించారు.
రెండో సారి ఎంపీ కేశినేని నాని గెలిచినా పార్టీ ఓడిపోయింది. అప్పటి నుండి ఆయన వ్యవహారశైలి పార్టీని ఇ్బబంది పెట్టే విధంగానే ఉంది. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోవడం…టీడీపీ కన్నా తానే బలవంతుడినని చెప్పుకుని చంద్రబాబుపైనే విమర్శలు చేయడం వంటివి చేశారు. ఆయన తీరు రోజు రోజుకు సమస్యగా మారుతోంది. తాజాగా తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతలు ఆయనకు ఇవ్వకపోయినప్పటికీ… సన్నాహాక సమావేశానికి అనుచరులతో కలిసి వచ్చి రచ్చ చేశారు. కేశినేని సోదరుడు శివనాథ్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి శివనాథ్ తో గొడవలు ఉన్న నాని ఈ వ్యవహారం తర్వాత ఆయనపై మండిపడ్డారు.
స్థానిక ఎన్నికల్లో తన కుమార్తెను ఏకపక్షంగా మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. తన సొంత బలంగా గెలిపించుకుంటానని సవాల్ చేశారు. చివరికి టీడీపీ ఘోరపారజయం పాలైంది. అయినా ఆయన తగ్గలేదు. ఈ పరిణామలన్నింటినీ గ్రహించిన హైకమండ్.. కేశినేని నానికి మూడో చాన్స్ లేదని తెలిపింది. సైలెంట్ గా ఉండాలని నేరుగానే వర్తమానం పంపింది. ఇక ఆయన ఏం చేస్తారన్నది విజయవాడ టీడీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.