తెలంగాణ బీజేపీలో ఎంపీ టిక్కెట్ల లొల్లి ప్రారంభమయింది. బండి సంజయ్ ను సిట్టింగ్ స్థానం నుంచి తప్పించేందుకు పక్కా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల కరీంనగర్లో బండి సంజయ్ వ్యతిరేక గ్రూపుల హడావుడి ఎక్కువగా ఉంది., ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని మీటింగ్‌లు పెడుతున్నారు. సాధారణంగా బీజేపీలో ఇలాంటివి ఉండవు. కీలక నేతల ప్రోత్సాహంతోనే జరుగుతాయని అనుమానిస్తున్నారు. అభ్యర్థులు ఖరారు కాలేదని.. సిట్టింగ్‌లకు టిక్కెట్లు గ్యారంటీ లేవని కిషన్ రెడ్డి నేరుగానే మీడియాతో చెప్పారు.
అమిత్ షా టూర్ సందర్భంగా సిట్టింగ్‌లకు టిక్కెట్లు ప్రకటించారన్న ప్రచారం జరిగింది. దీన్ని కిషన్ రెడ్డి ఖండించడంతో పాటు.. ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలను ప్రచారంలోకి పెట్టారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ మరోసారి బరిలోకి దిగటం పక్కాగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గాల్లో వారిద్దరికీ ఇతర నేతల నుంచి పోటీ కూడా లేదు. కొన్ని రోజులుగా కరీంనగర్, ఆదిలాబాద్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల నుంచి టికెట్లు ఇవ్వబోరనే చర్చ ఇప్పటికే జోరుగా నడుస్తున్నది.
ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి అనూహ్యంగా ఆదిలాబాద్‌లో విజయం సాధించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన సొంతగూటి నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాపూరావు రేసులోకి వచ్చారు. వారిద్దరూ బలమైన అభ్యర్థులే. అక్కడ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్‌ని వేరే నియోజకవర్గానికి పంపి ఆ స్థానం నుంచి రెడ్డి లేదా ముదిరాజ్ సామాజిక తరగతులకు చెందిన వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్యనేతలు పట్టుబడుతున్నారు.
తాజా రాజకీయ పరిస్థితుల్లో అక్కడ నుంచి బండి గెలవడనీ, అభ్యర్థిని మార్చాలని ఆ పార్టీలోని బండి వ్యతిరేక వర్గం పట్టుబడుతోంది. వారికి కిషన్ రెడ్డి అండ ఉండదని చెబుతున్నారు. బండిని జహీరాబాద్‌కు మార్చి ఈటలను అక్కడ నుంచి పోటీచేయిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అక్కడ ఈటలకు సీటివ్వకపోతే మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. మహబూబ్‌నగర్ స్థానం తమకంటే తమకే అని డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ బీజేపీకి తలనొప్పిగా మారుతున్నాయి.