వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ వెంటనే ఆమె నోటి వెంట తాను క్రిస్టియన్‌ను అనే మాట వచ్చింది. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆ మాట చెప్పారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. అక్కడ చెప్పాల్సిన స్పేస్ లేదు ఆమె సృష్టించుకున్నారు. మణిపూర్‌లో చర్చిలు కూల్చేశారని.. తాను క్రిస్టియన్ అయినందున చాలా బాధపడ్డానన్నారు.
రాజకీయాల్లో కుల, మతాల పాత్ర కీలకం. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో దళితులు, క్రిస్టియన్లు కీలకం. ఏపీలోనూ అంతే. అయితే ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేకపోవడం వల్ల ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి తరలిపోయింది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ ను వెనక్కి తెప్పించుకునే లక్ష్యంతో షర్మిల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. క్రిస్టియన్, దళిత ఓటు బ్యాంక్ తిరిగి వస్తే కాంగ్రెస్ బాగా బలపడుతుంది.
షర్మిల భర్త .. అనిల్ కుమార్ మత ప్రచారకుడు. ఆయనకు ఏపీ వ్యాప్తంగా చర్చిల్లో మంచి పలుకుబడి ఉంది. ఆయన వైసీపీ కోసం చర్చిల్లో ఎన్నికల సమయంలో ప్రార్థనలు నిర్వహించేవారు. వైసీపీకి ఓటు వేయించేలా దళితుల్ని .. క్రిస్టియన్లను ప్రోత్సహించేవారు. ఆయన వల్లనే ఎక్కువ దళిత క్రిస్టియన్ల ఓట్లు వైసీపీకి పడ్డాయని చెబుతారు. ఇప్పుడు షర్మిల ఆ ఓట్లన్నింటిపై గురి పెట్టి.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.