జనవరి 5 వ తేదీకి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొత్త తరం నేతలు, కార్యకర్తలకు పెద్దగా ఈ ఎమోషన్ తెలియదు కానీ.. పార్టీ ఆవిర్భావం నుంచి భాగమైన సీనియర్లకు మాత్రం… జనవరి 5వ తేదీ వస్తే మాత్రం.. పసుపు జెండా రెపరెపలు గుండె లోతుల్లోంచి వీస్తాయి.. ఎందుకంటే.. అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి తొమ్మిది అంటే తొమ్మిది నెలల్లో ఆధికారంలోకి తెచ్చారు. అలా అధికారంలోకి వచ్చినట్లుగా ప్రజా తీర్పు వెల్లడైన రోజు.. జనవరి 5, 1983.
తెలుగువాడి తీర్పు – ఎన్టీవోడి రాజకీయ సంతకం
1983లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించింది అసాధారణ విజయం. ఆ రోజుల్లో ఇలా సర్వేలు లేవు. అసలు ఎన్నికల్లో ఇంత హంగామా ఉండవు. ప్రజలు స్వచ్చందంగా తమకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసి వచ్చేవారు. ఇంటింటి ప్రచారాలు కూడా తక్కువే. అలాంటి రోజుల్లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమా హీరో పార్టీ పెడితే ఓట్లేస్తారా అని చాలా మంది నమ్మలేకపోయారు. వారందరి అంచనాలను పటా పంచలు చేస్తూ.. . దేశ రాజకీయాల్లో తెలుగు సంతకం చేస్తూ.. తీర్పు ఇచ్చారు ఆంధ్రులు. 46 శాతం ఓట్లతో 201 సీట్లు సాధించారు. గతంలో కాంగ్రెస్కు కూడా ఎప్పుడూ అంత శాతం ఓట్లు రాలేదు.
జనవరి 5న ఆవిర్భవించిన బీసీ నాయకత్వం
ఎన్టీఆర్ రామారావు పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకు వచ్చారు. తనతో పాటు తెలంగాణ, ఏపీ నుంచి ఎంతో మంది బడుగు బ లహీన వర్గాలకు చెందిన .. రాజకీయ అనుభవం లేని యువకుల్ని తెరపైకి తెచ్చారు. వారికి ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేకపోయినా తానే సమకూర్చారు. అలాంటి నేతలు ఎందరో తర్వాత ఆయా సామాజికవర్గాల తరపున ప్రతినిధులుగా రాజకీయాల్లో తిరుగులేని నేతలయ్యారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న ప్రముఖ బీసీ నేతలంతా టీడీపీ మూలాలు ఉన్నవారే.. ఏపీలోనూ అంతే. కాల క్రమంలో చాలా మంది టీడీపీని వీడి ఉండవచ్చు కానీ.. రెండు రాష్ట్రాల్లో బీసీలను రాజకీయంగా ఎదిగేలా చేసింది మాత్రం టీడీపీ. ఆ నాయకత్వం ప్రజా తీర్పుతో వెలుగులోకి వచ్చింది మాత్రం జనవరి ఐదో తేదీనే.
టీడీపీ చరిత్రలో జనవరి 5 కి ఎమోషనల్ కనెక్షన్
ఎన్నో ప్రాంతీయపార్టీలు వచ్చాయి. పోయాయి. టీడీపీ మాత్రం… మొదట వచ్చిన ఫలితాల బలంతో.. సిద్ధాంత పంగా పునాదుల్ని బలంగా వేసుకుని కొనసాగుతోంది. టీడీపీని బలహీనపర్చడానికే… జాతీయపార్టీలు కుట్ర పన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించాలన్నది కఠోరవాస్తవం. ఆ కుట్రతో టీడీపీని ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీకి పరిమితం చేశామని సంతృప్తి పడుతూ ఉండవచ్చుకానీ.. తెలుగు వారికి ఎంత ద్రోహం చేశారో గుర్తించలేకపోతున్నారు. టీడీపీ ఎప్పుడూ ఫీనిక్స్ లాగే ఎదుగుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రజా మద్దతుతో .. ఎదుగుతూనే ఉంది. మరోసారి అదే ప్రయత్నంలో ఉంది. ఆ నాటి జనవరి 5 ఫలితాల ఎమోషన్ మరోసారి చూసేందుకు రెడీ అవుతోంది.